Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్.. టైమింగ్స్‌పై టీటీడీ కఠిన నిర్ణయం.. ఇక నుంచి..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా..? అయితే మీకో అలర్ట్. టీటీడీ దర్శనాలకు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి దర్శనం టికెట్‌లో ఏ టైమ్ అయితే ఉందో.. ఆ టైమ్‌కి మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ముందుగా వెళ్లడానికి అనుమతి ఉండదు.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్.. టైమింగ్స్‌పై టీటీడీ కఠిన నిర్ణయం.. ఇక నుంచి..
Tirumala

Updated on: Mar 10, 2026 | 9:27 PM

తిరుమల శ్రీవారి భక్తలకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనను సోమవారం నుండి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని, అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపింది.

సోమవారం నుంచి అమలు..

భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టికెట్లపై పొందుపర్చిన దర్శన సమయం కంటే ముందుగానే క్యూలైన్ల వద్దకు వస్తే అనుమతించమని, వాటిపై ప్రింట్ అయిన టైమ్‌కు మాత్రమే భక్తులను ఇప్పటినుంచి దర్శనాలకు అనుమతిస్తామంది. ఇప్పటివరకు టికెట్లపై ఉన్న టైమ్ కంటే ముందుగా వచ్చినా దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. ఆ సమయానికి భక్తులను క్యూలైన్లలోకి అధికారులు అనుమతిస్తారు. కానీ దీని వల్ల భక్తులందరూ ఒకేసారి క్యూలైన్లలోకి రావడం వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో దీనిని కట్టడి చేసేందుకు ఇక నుంచి టైమ్ నిబంధన ఖచ్చితంగా పాటించాలని టీటీడీ భావించింది. మార్చి 9 నుంచే దీనిని అమలు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో టికెట్లు..

టీటీడీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌ లైన్‌లో ప్రతీ నెలా విడుదల చేస్తోంది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లవచ్చు. దీని వల్ల దర్శనం కూడా సులభంగా పూర్తవుతుంది. ఇక టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తున్నారు. తిరుపతిలో బస్టాండ్, రైల్వే స్టేషన్,  అలిపిరి మెట్ల వద్ద వీటిని అందిస్తున్నారు. ఏ రోజు దర్శనానికి ఆ రోజు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. భక్తులు వీటిని తీసుకుని తమకు కేటాయించిన సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక ఆన్లైన్‌లో రూ.300 టికెట్లను బుక్ చేసుకునే సమయంలో మీరే దర్శనం టైమింగ్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. భక్తుల రద్దీని ప్రస్తుతం ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తిరుమల క్యూలైన్లు, మాడవీధులలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నేషన్ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని తెలుసుకుంటున్నారు. దీని వల్ల రద్దీని అంచనా వేయడం సులభతరం అయింది.

Follow Us