తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టిటిడి గురువారం నుంచి జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్ -2లో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీ కోసం టిటిడి సాధారణంగా టెండర్ల ద్వారా జీడిపప్పును కొనుగోలు చేస్తుందన్నారు. జీడిపప్పు బద్దలు తగినంత మొత్తంలో లభించకపోవడంతో మార్చి 21న తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శ్రీవారి సేవకులతో జీడిపప్పు బద్దల సేవను ప్రారంభించామని తెలిపారు. గత 52 రోజుల్లో శ్రీవారి సేవకులు 26 వేల కిలోల జీడిపప్పును బద్దలుగా మార్చారని చెప్పారు. రోజుకు 100 మంది చొప్పున ఇప్పటివరకు తిరుపతిలో 5200 మంది సేవకులు ఈ సేవలో పాల్గొన్నారని తెలిపారు.
ఇకపోతే, తిరుమలలో ప్రతి రోజు ప్రసాదాల తయారీకి 3500 కిలోల నుండి 4000 కిలోల వరకు జీడిపప్పు బద్దలు అవసరమవుతాయని చెప్పారు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి. దీంతో తిరుమలలో కూడా శ్రీవారి సేవకులతో జీడిపప్పు బద్దల సేవను ప్రారంభించామన్నారు. విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో పలు సంస్థలు జీడిపప్పును బద్దలుగా మార్చే యంత్రాలను తయారు చేస్తున్నాయని, ట్రయల్ రన్ కూడా జరిగిందని తెలిపారు. ఈ యంత్రాలు బాగా పనిచేస్తే కొనుగోలు చేస్తామన్నారు. అప్పటి వరకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.
అనంతరం పలువురు శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడుతూ జీడిపప్పును బద్దలుగా మార్చే సేవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ జిఎం శ్రీ సుబ్రమణ్యం, డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, విజివో శ్రీ బాలిరెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ దామోదరం, శ్రీవారి సేవ ఏఈవో శ్రీమతి నిర్మల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.