భక్తులకు అలర్ట్.. తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసేయనున్నారు. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నవంబర్ 8 వ తేదీన చంద్రగ్రహణం ఉండటంతో ఆ రోజు కూడా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసేస్తారు. గ్రహణం వీడగానే ఆలయ శుద్ధి అనంతరం గుడిని తెరవనున్నారు. గ్రహణం కారణంగా ఈ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతిచ్చింది. భక్తులు ఈ మార్పులను గమనించాలని, ఈ సమాచారం ప్రకారం ప్రణాళికలు వేసుకుని దర్శనానికి రావాలని సూచించింది.
కాగా.. రెండేళ్ల విరామం తర్వాత ఈ సారి జరిగే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయితే.. గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు తీసుకువచ్చే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ స్పష్టం చేసింది. మరోవైపు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి