తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..

దేశవ్యాప్తంగా రకరకాల రూపాల్లో ఉన్న లంబోదరుడిని పూజించి మురిసిపోతున్నాం.. కానీ ఎక్కడైనా తల లేని వినాయకుడిని పూజించడం మీరు చూశారా? అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఆలయంలోని వినాయకుడికి శిరస్సు ఉండదు. కేవలం మొండెం రూపంలోనే భక్తుల పూజలందుకుంటున్నాడు. సాక్షాత్తూ పరమశివుడు గణపతి తలను ఖండించిన పవిత్ర ప్రదేశంగా భావించే ఆ అరుదైన ఆలయం ఎక్కడుంది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తల లేని వినాయకుడు.. దేవభూమిలోని ఈ అద్భుత ఆలయం గురించి తెలిస్తే..
Ganesha Without Head Temple

Updated on: Sep 20, 2026 | 7:54 PM

వినాయక చవితి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా రకరకాల ఆకారాలు, రూపాల్లో కొలువుదీరిన లంబోదరుడిని చూసి భక్తులు పులకించిపోయారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింతైన గణపతి ఆలయం విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా గజముఖంతో కొలువయ్యే గణనాథుడిని పూజించడం మనకు తెలుసు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి తల ఉండదు. తల లేని మొండెం రూపంలోనే గణేశుడిని పూజించే ఈ వింత క్షేత్రం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటో తెలుసుకుందాం.

కేదార్ లోయలో కొలువైన ముండకటియా

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్ లోయ ప్రాంతంలో ఈ విశిష్టమైన ఆలయం ఉంది. పవిత్ర కేదార్‌నాథ్ క్షేత్రానికి వెళ్లే మార్గంలో సోన్‌ప్రయాగ్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని మందాకిని నది తీరాన ప్రకృతి ఒడిలో ఈ ముండకటియా గణేశ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయ విశిష్టత గురించి ప్రాచీన శివపురాణంలోనూ ప్రస్తావన ఉండటం విశేషం.

స్థల పురాణం: ఆ పేరు ఎలా వచ్చింది?

ఈ ఆలయం వెనుక ఒక బలమైన పౌరాణిక ఘట్టం ముడిపడి ఉంది. పార్వతీ దేవి తన నలుగు పిండితో గణేశుడిని సృష్టించి, తాను స్నానానికి వెళ్తూ ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించింది. తల్లి ఆజ్ఞను శిరసావహించిన బాల గణేశుడు.. పరమశివుడిని సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పరమేశ్వరుడు, తన త్రిశూలంతో బాల గణేశుడి తలను ఖండించాడు. ఆ పవిత్ర ఘట్టం జరిగిన ప్రదేశమే ఈ క్షేత్రమని స్థానిక భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంస్కృత, హిందీ భాషల్లో ముండ అంటే తల అని, కటియా అంటే నరకడం అని అర్థం. శివుడు గణేశుడి శిరస్సును నరికిన పవిత్ర స్థలం కావడంతో దీనికి ముండకటియా అనే పేరు స్థిరపడింది.

కేదార్‌నాథ్ యాత్రికులు తప్పక దర్శించే క్షేత్రం

హిమాలయాల మంచు పర్వతాలు, పక్కనే పరవళ్లు తొక్కే మందాకిని నదీ ప్రవాహం నడుమ కొలువైన ఈ ఆలయం అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. కేదార్‌నాథ్, గౌరీకుండ్ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్క భక్తుడు ఈ ముండకటియా ఆలయం వద్ద ఆగి, శిరస్సు లేని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వింత గణపతి ఆలయం ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us