
అతిగా ఆలోచించడం (ఓవర్ థింకింగ్) అనేది మనసును అదుపు తప్పించే ఒక అలవాటు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం, గతంలో జరిగిన వాటి గురించి పదే పదే మధనపడటం, లేదా చిన్న విషయాలను సైతం అతిగా విశ్లేషించడం వంటివి అతిగా ఆలోచించడంలో భాగంగా ఉంటాయి. ఇలాంటి మనస్థితి నుంచి బయటపడటానికి భగవద్గీత ఎంతో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది. దీని అర్థం: “నీకు కర్మ చేయడం మీద మాత్రమే అధికారం ఉంది. దాని ఫలితం ఎలా వస్తుందనే దానిపై ఫోకస్ చేయకూడదని అర్థం. అతిగా ఆలోచించేవారు తరచుగా తాము చేసే పనుల ఫలితాల గురించి ఎక్కువగా భయపడతారు. భగవద్గీత కర్మ చేయమని, ఆ కర్మను నిస్వార్థంగా, ఫలాపేక్ష లేకుండా చేయమని బోధిస్తుంది. ఫలితం గురించి చింతించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
“దుఃఖములు కలిగినప్పుడు కలత చెందని మనస్సు కలవాడు, సుఖములు కలిగినప్పుడు కోరిక లేనివాడు, రాగము, భయము, క్రోధము లేనివాడు, స్థిరమైన బుద్ధి ఉన్నవాడిని ముని అని చెప్పబడును.” గీత వర్తమానంలో జీవించడాన్ని నొక్కి చెబుతుంది. గతంలో జరిగిన వాటి గురించి పశ్చాత్తాపపడటం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వ్యర్థమని బోధిస్తుంది. ప్రస్తుత క్షణంలో మన దృష్టిని కేంద్రీకరించడం వల్ల అతిగా ఆలోచించడం తగ్గుతుంది.
గీతలో శ్రీకృష్ణుడు, మనస్సులో కలిగే ఆలోచనలు మన నిజ స్వరూపం కాదని బోధిస్తాడు. ఆలోచనలు కేవలం మనసు యొక్క క్రియలు మాత్రమే. వాటిని గమనించేవాడివి నీవు. వాటితో నిన్ను నువ్వు గుర్తించుకోనప్పుడు, అవి నీపై ప్రభావం చూపలేవు. మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనల నుండి దూరం పాటించడం ద్వారా వాటి ప్రభావం తగ్గుతుంది.
భగవద్గీత ఆత్మసంయమానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇంద్రియాలను, మనస్సును అదుపులో ఉంచుకోవడం అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. మనసు ఎల్లప్పుడూ బాహ్య విషయాల వైపు పరుగెత్తుతూ ఉంటుంది. దానిని నియంత్రించడం ద్వారా అనవసరమైన ఆలోచనలను తగ్గించుకోవచ్చు. ఎక్కడెక్కడ చంచలమైన అస్థిరమైన మనస్సు పోతుందో, అక్కడికక్కడే దానిని నిగ్రహించి, ఆత్మలో నిలిపి ఉంచాలి.
“అజ్ఞానము, శ్రద్ధ లేనివాడు, సందేహచిత్తుడు నశించిపోతాడు. సందేహచిత్తుడికి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలోనూ లేదు.” అతిగా ఆలోచించేవారిలో తరచుగా సందేహాలు ఎక్కువ ఉంటాయి. భగవద్గీత సరైన జ్ఞానాన్ని పొందడం ద్వారా, గురువుల నుంచి ఉపదేశాలు వినడం ద్వారా, మరియు ఆచరణ ద్వారా ఈ సందేహాలను దూరం చేసుకోమని చెబుతుంది. సందేహాలు మనస్సులో గందరగోళాన్ని సృష్టించి, అతిగా ఆలోచించడానికి దారితీస్తాయి.
ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా, అతిగా ఆలోచించే స్వభావం నుంచి బయటపడి, మరింత ప్రశాంతమైన, సమతుల్యమైన జీవితాన్ని గడపవచ్చు. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం కాదు, అది మానసిక శాంతికి, ఆత్మజ్ఞానానికి ఒక గొప్ప మార్గదర్శి.