Srisailam: శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక వార్త. స్వామి అమ్మవారి దర్శనానికి సాంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేసింది దేవస్థానం. ఇదే విషయాన్ని ఆలయ ఈవో లవన్న స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం వారంలో నాలుగు రోజులు ఉచిత స్పర్శదర్శనానికి అవకాశం కల్పించారు. ఉచిత స్పర్శదర్శనానికి వచ్చే బక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక నుంచి సాధారణ సమయాల్లోనూ సాంప్రదాయ దుస్తుల్లోనే అనుమతించడం జరుగుతుందని తెలిపారు.
కాగా, శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే గర్భాలయ ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తూ ఉన్నారు. అయితే వివిధ ప్రాంతాల భక్తుల అభ్యర్థన మేరకు సాయంకాలం కూడా ఉచిత స్పర్శదర్శనం కల్పించేందుకు నిర్ణయించామని తెలిపారు. వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుమతించగా.. గురువారం మాత్రం ఆలయ శుద్ధి చేసుకునేందుకు వీలుగా 01.30 గంటల నుంచి 02.30 వరకు గర్భాలయ ప్రవేశం ప్రవేశం కల్పించి తిరిగి సాయంకాలం 06.30 నుంచి 07.30 వరకు సామాన్యుల భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికి మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అయితే గర్భాలయంలోకి ప్రవేశించే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని భక్తులకు ఈవో లవన్న చెప్పారు.
Also read:
Kerala High Court: చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి.. లైంగిక వేధింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..