Sri Sitarama Kalyanam : ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీరాముల వారిచే అమ్మవారి తలపై జిలకర్ర, బెల్లం పెట్టించారు. అనంతరం మాంగళ్యధారణ కార్యక్రమం జరిగింది. ఈ కమనీయ వేడుకను కరోనా మహమ్మారి కారణంగా భక్తజనుల సందడి లేకుండానే నిర్వహించారు. రాములోరి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు సమర్పించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య దంపతులు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎస్పీ సునీల్ దత్, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని, ఎండోమెంట్ కమీషనర్ అనీల్ కుమార్ దంపతులు, సరస్వతి ఉపాసకులు డైవజ్ఞశర్మతో పాటు పలువురు స్వామివారి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు.
కాగా, ఇవాళ స్వామివారి కళ్యాణం ముగియడంతో రేపు శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. కొవిడ్ కారణంగా భద్రాద్రిలో పూజలు, తీర్థ ప్రసాదాలు నిలిపివేశారు.