Shivaratri: శివరాత్రి వేళ శివుడికి బదులు రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎందుకో తెలుసా?

| Edited By: Balaraju Goud

Mar 09, 2024 | 11:12 AM

ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలిచే రామతీర్థంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామ స్వామి వారి దేవస్థానమైన రామతీర్థంలో శివరాత్రి వేడుకలు పెద్ద ఎత్తున జరగడం ఇక్కడి ప్రాముఖ్యత. వాస్తవానికి ఇది వైష్ణవ క్షేత్రం. ఇది శైవక్షేత్రం కాకపోయినా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరగడం, రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం.

Shivaratri: శివరాత్రి వేళ శివుడికి బదులు రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఎందుకో తెలుసా?
Ramatheertham
Follow us on

ప్రముఖ పుణ్యక్షేత్రం, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పిలిచే రామతీర్థంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరామ స్వామి వారి దేవస్థానమైన రామతీర్థంలో శివరాత్రి వేడుకలు పెద్ద ఎత్తున జరగడం ఇక్కడి ప్రాముఖ్యత. వాస్తవానికి ఇది వైష్ణవ క్షేత్రం. ఇది శైవక్షేత్రం కాకపోయినా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరగడం, రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం.

16వ శతాబ్ధంలో అప్పటి విజయనగరం మహారాజు సీతారామచంద్ర గజపతిరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఏకశిలతో ఏర్పడిన పెద్ద బోడికొండ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కొండపై శ్రీ కోదండ రాముడి ఆలయం ఉంటుంది. ఇక్కడే సీతారాములు నడయాడిన ఆనవాళ్లు ఉన్నాయంటారు స్థానికులు. ప్రతీ శివరాత్రి రోజున ఇక్కడ మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిస్సా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే, వైష్ణవ కేత్రం అయిన రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ ఉత్సవాలు జరగడానికి ఒక విశిష్ట స్థల పురాణం ఉందని చెబుతారు ఆలయ అర్చకులు. త్రేతాయుగంలో శ్రీ సీతా రామచంద్ర మహాప్రభువు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని రోజులు నడయాడారట. ఆ సమయంలో శివరాత్రి రోజున శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ శివ పంచాక్షరి జపం చేసినట్లు ఆధారాలున్నాయట. ఆ తర్వాత ద్వాపరయుగంలో పాండవులు ఈ ప్రాంతంలో వనవాసం చేసినట్లు ఆధారాలున్నాయి. బోడికొండపై వారు నివసించినట్లు ఇప్పటికి కూడా ఆధారాలు దర్శనమిస్తాయి. అయితే ఆ సమయంలో శ్రీ కృష్ణ భగవానుడు ఇక్కడకు వచ్చి పాండవులను కలిశారట. త్రేతాయుగంలో తన రూపమైన శ్రీరాముని శిల్పాన్ని వారికి అందజేసి తన రూపంగా కొలవమని ఆయన వెళ్లిపోయారట. అప్పటి నుంచి పాండవులు అక్కడ శ్రీరాముడిని ఆరాధిస్తూ వచ్చారట.

అయితే తరువాత కలియుగంలో త్రేతాయుగంలో పాండవులు పూజించిన శ్రీసీతారామ లక్షణస్వామి విగ్రహాలు లభించడం, అప్పటి విజయనగరం సంస్థాన మహారాజైన సీతారామచంద్ర గజపతి రాజు ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇది రామతీర్థంగా ప్రాచుర్యం పొందిందినట్లు చెబుతున్నారు. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు శివరాత్రి రోజున శివుడిని పూజించాడు కాబట్టి ఆ రోజున ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

రామతీర్థం ఆలయ నిర్మాణం జరిగిన కాలంలో విజయనగరం సంస్థానం వారు పూసపాటిరేగ వద్ద గల కుమిలి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవారు. అక్కడ నుంచి ప్రతి శివరాత్రి రోజున అప్పటి సంస్థాన మహారాజుల కుటుంబం రామతీర్థానికి వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేవారు. సంస్థాన రాజ కుటుంబంతో పాటు ఆ ప్రాంతంలో అధికంగా ఉండే తీర ప్రాంత మత్స్యకారులు కూడా వారి వెంట వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇక అప్పటి నుంచి కూడా సాధారణ భక్తులతో పాటు ప్రతీ శివరాత్రి రోజున పూసపాటిరేగ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రతీ శివరాత్రికి మేళతాళాలతో రామతీర్థం చేరుకుంటారు. అక్కడ శ్రీ రామస్వామివారిని దర్శించుకొని, అలాగే, ప్రక్కనే ఉన్న క్షేత్రపాలకుడైన శ్రీ ఉమా సదా శివస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆ రాత్రంతా శ్రీరామస్వామి, శివ నామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తారు. మరుసటి రోజు వేకువజామునే రామతీర్థం స్వామివారి కోనేటిలో శుద్ధ స్నానమాచరించి, శివకేశవలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

అయితే శివరాత్రి సందర్భంగా రామతీర్థంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగడం విశేషం. శివరాత్రి రోజున రామతీర్థానికి లక్షల మందిలో భక్తులు తరలివస్తుంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కాకుండా ఒడిశా నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు. అలా ఎక్కడా లేని విధంగా రామతీర్థం వైష్ణవాలయంలో శివభక్తులు పోటెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…