
Shirshasana Shiva Temple: మహా శివుడు ఎక్కువగా లింగం రూపంలోనే దర్శనమిస్తుంటాడు. కొన్ని చోట్ల మాత్రం పూర్తి ఆకారంలో భక్తులను అనుగ్రహిస్తుంటాడు. మరికొన్ని చోట్ల ఇంకా ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తుంటాడు. మనం ఇప్పుడు చెప్పుకునే ఆలయంలో మాత్రం పరమ శివుడు శీర్షాసనంలో అంటే తలకిందులుగా దర్శనమిస్తాడు. ఈ ప్రత్యేకత కలిగిన ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులోని పార్వతీసమేత శక్తీశ్వరస్వామి ఆలయంలో శివుడు శిర్షాసనంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో శీర్షాసనంలో ఉన్న శివుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
త్రేతాయుగంలో శంబరుడు అనే రాక్షసుడు.. రుషులు, మునులు చేసే తపోదీక్షలను భగ్నం చేస్తుండేవాడు. శంబరుని చేతిలో ఓడిపోయిన యమధర్మరాజు అవమాన భారంతో ఘోర తపస్సు చేశాడు. కానీ, తపోనిష్టలో ఉన్న శివుడు యముని తపస్సును గుర్తించలేదు. ఈ విషయాన్ని గమనించిన పార్వతీదేవి.. యముడికి శక్తిని ప్రసాదించి శంబరుని వధించేట్లుగా చేస్తుంది. అమ్మవారు తనపై చూపించిన కరుణకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని యమపురిగా కూడా పిలుచుకుంటారు.
ఇది కాలక్రమేణా యమునాపురం.. చివరకు యనమదుర్రుగుగా మారిపోయింది. యముని కోరిక మేరకు పార్వతీదేవి మూడు నెలల శిశువు షణ్ముఖునితో శీర్షాసన భంగిమలో ఉన్న పతితో సహా ఇక్కడే ఆవిర్భవించారని చరిత్ర చెబుతోంది. ఎంతో మహిమాన్విత గల ఈ దివ్య క్షేత్రాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని తన్యయత్వం చెందుతారు.
ఈ ఆలయంలో శివుడు శీర్షాసనంలో (తలకిందులుగా) దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదైన రూపం.
శివునితో పాటు పార్వతి దేవి, ఆమె ఒడిలో సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు.
ఆలయంలోని పుష్కరిణి నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం.
భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆరోగ్య, మానసిక సమస్యలు తొలగుతాయని నమ్మకం.