
సాధారణంగా నిద్రలో కలలు వస్తుంటాయి. కొన్ని కలల్లో మంచి జరిగినట్లుగా ఉంటే.. మరికొన్ని చెడు కలలు వస్తుంటాయి. అయితే, కొన్ని కలలు మాత్రం మన ఆలోచనలు, భవిష్యత్తుకు సంకేతంగా ప్రతిబింబిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. చంద్రుడిని మనస్సు, చల్లదనానికి కారకంగా పరిగణిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. చంద్రుడినికి సంబంధించిన కలలు భవిష్యత్ సంఘటనల గురించి ప్రత్యేక సూచనలు ఇస్తాయి. దీనికి సంబంధించిన కొన్ని కలలు శుభ సంకేతాలు ఇస్తుండగా.. మరికొన్ని అశుభ సంకేతాలను కూడా ఇస్తాయి. కలలో చంద్రుడిని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే, కలలో చంద్రుడిని వేర్వేరు ఆకారాలలో చూడటం కూడా విభిన్న సూచనలు ఇస్తుంది. ఇప్పుడు పౌర్ణమినాడు ఉండే సంపూర్ణ చంద్రుడు కలలో చూడటం శుభమా లేక అశుభమా అనేది తెలుసుకుందాం.
కలల శాస్త్రం ప్రకారం.. మీ కలలో నెలవంకను చూడటం వ్యాపారానికి, ఉపాధికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నిరుద్యోగులకు ఈ కల త్వరలో ఉద్యోగం లభిస్తుందనే శుభ సంకేతాన్ని ఇస్తుంది. వ్యాపారవేత్తలకు ఈ కల వారి వ్యాపారంలో ఆర్థిక పురోగతిని సూచిస్తుంది.
పౌర్ణమి చంద్రుడు లేదా పౌర్ణమి రాత్రి కలలో చూడటం అత్యంత శుభప్రదమైన కలలో ఒకటి. మీరు చాలా కాలంగా చేస్తున్న పనిలో విజయం సాధిస్తారని దీని అర్థం. కుటుంబసభ్యుల మధ్య ఉన్న విభేదాలు ముగిస్తాయి. సంబంధాలు మరింత సామరస్యపూర్వకంగా మారుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు తల్లితో కూడా సంబంధం కలిగి ఉంటాడు. కలలో పౌర్ణమిని చూడటం అంటే తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆమెతో మీ సంబంధం బలపడుతుందని అర్థం. ఇంకా ఈ కల వ్యాపారం లేదా విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలను కూడా సూచిస్తుంది. ఇంకా, ఈ కల వైవాహిక జీవితంలో ఆనందాన్ని కూడా సూచిస్తుంది.
చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నట్లు లేదా పదే పదే అదృశ్యమవుతున్నట్లు మీరు కలలో చూస్తే.. మీ కోరికలను సాధించకుండా అడ్డంకులు మిమ్మల్ని నిరోధిస్తున్నాయని అర్థం. ఈ కల మీరు మీ వ్యూహాన్ని మార్చుకోవాలని, మరింత కష్టపడి పనిచేయాలని సూచిస్తుంది. అప్పుడే విజయం సాధిస్తారు.
కలలో ఎర్రటి చంద్రుడిని చూడటం అశుభ సంకేతం. చంద్రుడికి సంబంధించిన ఈ కలలు మీ జీవితంలో అనవసరమైన వాదనలు, సంఘర్షణలు సూచిస్తాయి. అలాంటి కలలు మానసిక అశాంతిని ప్రతిబింబిస్తాయి. దీనిని నివారించడానికి మీరు ప్రశాంతంగా ఉండటానికి, పరిస్థితులను ఎదుర్కోవడానికి యోగా, ధ్యానం చేయండి.
కలలో చంద్రుడు విరిగిపోయినట్లు లేదా ముక్కలుగా విడిపోయినట్లు కనిపిస్తే అశుభ సంకేతంగా భావిస్తారు. ఇది మీ లేదా మీ కుటుంబ సభ్యుల అనారోగ్యాన్ని సూచిస్తుంది. అంతేగాక, కుటుంబం విడిపోవడం లేదా సంబంధాలలో విచ్ఛిన్నం గురించి హెచ్చరిస్తుంది. అలాంటి కల తర్వాత మీ మాటల్లో సంయమనం ఉండాలి. అనవసరమైన ప్రతిచర్యలను నివారించడం మంచిది.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, స్వప్నశాస్త్రానికి సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)