
ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందువుల ఆరాధ్య దైవం శివుడికి సంబంధించిన విగ్రహాలు లభిస్తూనే ఉంటాయి. ఆయనను అనేక రూపాల్లో భక్తులు పూజిస్తారు. లింగ రూపంలోనే ఎక్కువగా శివుడు భక్తులకు దర్శనమిస్తుంటాడు. చాలా తక్కువ ఆలయాల్లో మాత్రమే శివుడు పూర్తి రూపాన్ని చూడవచ్చు. మనదేశంతోపాటు అనేక దేశాల్లోనూ శివుడి రూపాలు దర్శనమిస్తుంటాయి. కొన్ని దేశాల్లో శివుడిని ప్రత్యేక రూపాల్లో ఆరాధిస్తుంటారు. ఇప్పుడు పాకిస్థాన్ దేశంలోనే ఒక ప్రత్యేకమైన రూపం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక మట్టి అగ్నిపర్వతాన్నే శివుడిగా భావించి పూజిస్తుంటారు భక్తులు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని హింగోల్ జాతీయ ఉద్యానవనంలో ఉన్న చంద్రగుప్ మట్టి అగ్ని పర్వతం హిందువులకు పవిత్ర గమ్యస్థానం. చంద్రగుప్ మట్టి అగ్ని పర్వతంను అక్కడి హిందువులు శివుడి రూపంగా బాబా చంద్రగుప్ పేరుతో ఆరాధిస్తుంటారు.
ఈ అగ్నిపర్వతం ఒక ముఖ్యమైన ప్రదేశం. హింగ్లాజ్ మాతా యాత్ర తర్వాత ఎక్కువ మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. హింగ్లాజ్ మాతా యాత్ర అనేది పాకిస్థాన్(బలూచిస్థాన్)లోని అతిపెద్ద హిందూ తీర్థయాత్ర. ప్రతీ సంవత్సరం 2 లక్షల మందికిపైగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. హింగ్లాజ్ మాత 51 శక్తి పీఠాలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం సతీదేవి తల ఇక్కడ పడింది.
హింగ్లాజ్ మాత యాత్ర చేపట్టేవారికి చంద్రగుప్ అగ్ని పర్వతం అంచునకు ఎక్కడం అనేది ఆచారంలో ఒక భాగం. ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు సమర్పిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అంతేగాక, ఈ మట్టి అగ్ని పర్వతం ఎక్కడానికి ముందు భక్తులు రాత్రంతా మేల్కొని.. శివ స్మారణ చేసి, ఉపవాసం ఉంటారు. రోటీలు తయారు చేసి పర్వతానికి సమర్పిస్తారు. తమ పాపాలను పోగొట్టి తమపై అనుగ్రహం చూపాలని కోరుతూ పర్వతానికి భక్తులు నమస్కరిస్తారు.
మాతా హింగ్లాజ్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ అగ్ని పర్వతానికి వచ్చే యాత్రికులు బాబా చంద్రగుప్ సందర్శన తర్వాతే.. శ్రీహింగ్లాజ్ మాతా ఆలయంలోకి ప్రవేశించవచ్చని నమ్ముతారు. అగ్నిపర్వత శిఖరం వద్ద యాత్రికులు తమ పూర్తి పేరు, ఎక్కడ్నుంచి వచ్చామనే వివరాలు తెలిపి పరిచయం చేసుకోవాలి. తాము చేసిన పాపాలను తొలగించి తమను అనుగ్రహించాలని ప్రార్థించాలి. ఈ క్రమంలో బురద ఉబ్బడం, గాలి ప్రతిచర్య ద్వారా యాత్రికుల పాపాలు క్షమించబడ్డాయో లేదో అక్కడి చరీదార్ చెబుతారు.
అగ్నిపర్వతం నుంచి భక్తులు దిగినప్పుడు.. వారి ముఖంపై పవిత్రమైన బురద పడి ఉంటుంది. దీనినే శివ ఆశీర్వాదంగా భక్తులు భావిస్తారు. చంద్రగుప్ బురద అగ్ని పర్వతం వద్ద పూజలు నిర్వహించిన అనంతరమే యాత్రికులు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని కీర్తర్ పర్వతాల దిగువ ప్రాంతంలో ఉన్న ప్రధాన హింగ్లాజ్ ఆలయాన్ని సందర్శిస్తారు. మహా శివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తారు.