Chinna Jeeyar Swamy: ప్రపంచ శాంతి కోసం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి చూపుతున్న ప్రత్యేక చొరవను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భగవత్ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని శుక్రవారంనాడు చిన్నజీయర్ స్వామి ఆహ్వానించారు. ప్రధాని నివాసంలో ఆయనను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల విశిష్టతను మోదీకి చిన్న జీయర్ స్వామి వివరించారు. జూపల్లి రామేశ్వరరావు కూడా చిన్నజీయర్ స్వామితో పాటు మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను వివరించారు. సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టత, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహవిగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చినజీయర్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు . విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి తప్పక వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది 216 అడుగుల పంచలోహ విగ్రహం. మొత్తం 200 ఎకరాల్లో వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ విగ్రహావిష్కరణ మహోత్సవాలు జరగనున్నాయి. 35 హోమగుండాలతో ప్రత్యేకయాగం చేయనున్నారు.
ఈ మహోత్సవానికి ఆహ్వానించేందుకు ఐదు రోజులుగా దిల్లీలో పర్యటిస్తున్న చిన్న జీయర్.. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి సహా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితరులను ఆహ్వానించారు.
Also Read..
సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి