
ప్రకృతిలో మనకు లభించే మొక్కలలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు.. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం కూడా అత్యంత పవిత్రమైనది. అయితే చాలా మంది వేప చెట్టును ఇంట్లో పెంచవచ్చా లేదా అని సందేహిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. వేప చెట్టుకు ప్రతికూల శక్తిని గ్రహించి, సానుకూలతను వ్యాప్తి చేసే అద్భుత శక్తి ఉంది. ఇంట్లో వేప చెట్టు ఉండటం వల్ల వాతావరణం శుద్ధి అవ్వడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత నెలకొంటుంది.
మత విశ్వాసాల ప్రకారం.. వేప చెట్టు శని, రాహు, కేతు గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. జ్యోతిష్య నిపుణుల సూచన మేరకు సరైన దిశలో వేపను నాటితే, ఈ గ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.
వేప చెట్టును సాక్షాత్తు అంగారకుడి స్వరూపంగా భావిస్తారు. ఇంటి బయట వేప చెట్టును నాటి, దానిని సంరక్షించడం వల్ల జాతకంలోని కుజ దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా వేప చెట్టును సేవించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై శుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు.
ఆంజనేయ స్వామికి, వేప చెట్టుకు దగ్గరి సంబంధం ఉంది. రోజూ వేప చెట్టుకు నీరు పోస్తూ, దానిని భక్తితో చూసుకునే వారికి హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా మకరం, కుంభ రాశి వారు వేప చెట్టును నాటి పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
వాస్తు ప్రకారం వేప చెట్టును ఎల్లప్పుడూ దక్షిణ దిశలో నాటడం అత్యంత శుభప్రదం. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వేప చెట్టును సాధ్యమైనంత వరకు ఇంటి లోపల కాకుండా ఇంటి వెలుపల నాటాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చెట్టు ఎండిపోతే, దానిని వెంటనే తొలగించి కొత్త మొక్కను నాటాలి. వాస్తు ప్రకారం.. ఎండిపోయిన చెట్టు ఇంట్లో మానసిక ఒత్తిడిని, ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.