చార్‌ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్‌ధామ్ అంటారని మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గంగోత్రి మరియు యమునోత్రి ధామ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఆయా పుణ్య క్షేత్రాల్లో రద్దీని నివారించడానికి ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేశారు ఉత్తరాఖండ్ అధికారులు. ఈ నేపథ్యంలో మొదటి దశలో కేదార్‌నాథ్‌కు ప్రతిరోజూ 9000, బద్రీనాథ్‌కు 10000 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి.
అయితే కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో ప్రయాణీకుల సామర్థ్యం వరుసగా 15000, 18000గా నిర్ణయించారు అధికారులు. అంతేకాక ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కోసం రాష్ట్రాన్ని సందర్శించడానికి భక్తులు ఫోటోమెట్రిక్/బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోవడాన్ని తప్పనిసరి చేసింది. 2014 కేదార్‌నాథ్ వరదలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు. ఇక ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి, ఏప్రిల్ 25న కేదార్‌నాథ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ క్షేత్రాల తలుపులు తెరుచుకుంటాయి. ఇటీవలి కాలంలో బద్రీనాథ్ ముఖద్వారమైన జోషీమఠ్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లలో పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే.
WhatsApp ద్వారా చార్‌ధామ్ యాత్రను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం 8394833833 వాట్సాఫ్ నంబర్‌కు ‘Yatra’ అని మెసేజ్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి జవాబు ఇస్తే చాలు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే. అలాగే చార్‌ధామ్ యాత్ర కోసం టోల్ ఫ్రీ నంబర్ 01351364 కూడా అందుబాటులో ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..