తెలుగు రాష్ట్రాల భక్తుల మనసు దోచిన ప్రసాదాలు ఇవే.. ఒక్కో మహా ప్రసాదం వెనుక ఒక్కో విశిష్టత..

|

Oct 13, 2024 | 9:06 PM

ఇష్టదైవానికి నివేదించిన ప్రసాదాలను స్వీకరించడాన్ని భక్తులు ఒక వరంగా భావిస్తారు. తమకు లభించిన మహాభాగ్యంగా ఆనందిస్తారు. ఆవిధంగా రుచికి, మహత్తుకు పేరెన్నిక గన్నది తిరుమల శ్రీవారి ప్రసాదం. వెంకటేశుడి లడ్డూకి పోటీనిచ్చే మహా ప్రసాదం మరేదీ లేకపోవచ్చుగాక. కానీ.. భక్తజన కోటిలో విపరీతమైన పాపులారిటీ ఉన్న మహా ప్రసాదాలు చాలానే ఉన్నాయి. దేని స్పెషాలిటీ దానిదే. అన్నీ భక్తులకు ట్వంటీఫోర్ క్యారెట్స్ ధన్యతనిచ్చే ప్రసాదాలే.

తెలుగు రాష్ట్రాల భక్తుల మనసు దోచిన ప్రసాదాలు ఇవే.. ఒక్కో మహా ప్రసాదం వెనుక ఒక్కో విశిష్టత..
iconic prasads
Follow us on

తిరుమల శ్రీవారి చెంత లడ్డూ ప్రసాద పరిమళం ఎంతంటే ఏం చెప్పగలం..? అన్నవరం సత్యదేవుడికి నివేదించే గోధుమ నూక ప్రసాదం గుండెకు ఎంతెంత హాయికరం..? మంత్రాలయం రాఘవేంద్రుడి మఠంలో దొరికే పరిమళ ప్రసాద.. తాకితేనే భక్తి ప్రపూర్ణం. సింహాచలం ప్రసాదం తింటే.. అక్కడికెళ్లి అప్పన్నస్వామి దర్శన భాగ్యం చేసుకున్నట్టే.. శబరిమలై అయ్యప్ప సన్నిధిలో అరవణ పాయసం.. అరచేత దక్కిన పుణ్యఫలం.

పత్రం-పుష్పం-ఫలం-తోయం..! పండ్లో పూలో అరచెంచాడు నీళ్లో ఏదిచ్చినా స్వీకరిస్తానంటూ స్వామి వారు ఉదార స్వభావంతో చెబితే చెప్పొచ్చు గాక. ఆయన నోటిని తీపి చేసేవి.. ఆయనకంటూ అత్యంత ప్రీతిపాత్రమైనవి కొన్నుంటాయి. వాటిని వండి నివేదన చెయ్యాల్సిన బాధ్యత సగటు భక్తుడిదేగా..? అలా పుట్టిందే స్వామివారి ప్రసాదం. ఆ మామూలు ప్రసాదాలే మహా ప్రసాదాలైతే..!

మామిడి, కమల, పుచ్చకాయ, తులసి ఆకులు, జామ, ప్యాషన్‌ ఫ్రూట్, దేశీయ పానీయాలు, సగ్గు బియ్యం.. ఇలా లెక్కకు మించి ముడి పదార్థాలతో తయారయ్యే లడ్డూలైనా, వడలైనా, పాయసాలైనా.. పులిహోరలైనా, దద్దోజనమైనా..! గర్భగుడిలో మూల విరాట్టు దగ్గరుంచి.. పూజించి, అర్చించి, ఆ మంత్రజలాన్ని చిలకరించి.. ఆ విధంగా పునీతమయ్యాకే పదార్థం ప్రసాదమౌతుంది. ఆ ప్రసాదం మహా ప్రసాదమౌతుంది.

భగవంతుడికి.. భక్తుడికి.. అనుసంధానమైనది..! భక్తికి భక్తి… క్రేజుకు క్రేజు.. పరిమళానికి పరిమళం..! నాలుగు పొలుకులు చేతుల్లోకి తీసుకుని, కళ్లకద్దుకుని నోట్లో వేసుకుంటే చాలు.. గుండెల్ని నిమురుతూ. పొట్టలోకి దిగితే అదోరకం ఆధ్యాత్మిక తన్మయత్వం. భక్తుడికి దొరికే అనిర్వచనీయమైన అనుభూతి.

మహా ప్రసాదం అనగానే మొదటగా గోచరించేది.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.

వినరో భాగ్యము అనుకుంటూ విష్ణుకథల్ని విని ఎలా తరిస్తామో.. తినరో భాగ్యము అంటూ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని తిని తరించడం భక్తకోటికుండే అలవాటు. తిరుమల శ్రీవారి లడ్డు.. కోట్లాది మంది భక్తిభావంతో స్వీకరించే మహా ప్రసాదం. భక్తిరస మాధుర్యాన్ని పంచుతూ.. 300 ఏళ్లకు పైబడి చరిత్రను సొంతం చేసుకున్న అమృత పదార్ధం. భక్తులు శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో శ్రీవారి లడ్డు ప్రసాదాన్నీ అంతే పవిత్రంగా భావిస్తారు. ప్రతీరోజూ సగటున మూడున్నర లక్షల లడ్డూలు తయారౌతాయక్కడ.

ఇంతటి మాధుర్యాన్ని అందించే ఒక్కో లడ్డూ తయారీ కోసం 48 రూపాయలు ఖర్చు చేస్తున్న టిటిడి 50 రూపాయలకు విక్రయిస్తోంది. 5 వేల 100 లడ్డూల తయారీకి 803 కేజీల ముడి సరుకును వాడతారు. ఇందులో ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు. తిరుమల లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది టీటీడీ. లడ్డు తయారీలో ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచి.. ప్రతినెలా కోటీ 10 లక్షల లడ్డూలను భక్తులకు అందజేస్తోంది టీటీడీ. ఈవిధంగా ఏటా 500 కోట్ల ఆదాయం వస్తోందన్నది అంచనా. తాజాగా.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 లక్షల లడ్డూల పంపిణీ జరిగింది.

ఈలెక్కన కల్తీ నెయ్యి వివాదం లడ్డూల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని రుజువైంది. సో.. శ్రీవారి మహా ప్రసాదం- మూడు శతాబ్దాల నుంచీ భక్తుల్లో చెక్కుచెదరని ఒక మహా నమ్మకం. భక్తకోటికి ఇంతటి ప్రీతిపాత్రమైన లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ కూడా ఎంతో ఇష్టమట.  తిరుపతికెళ్లొచ్చా అనగానే… వెరీ నెక్స్ట్ ఎదురయ్యే ప్రశ్న.. ప్రసాదమెక్కడ? అని. అలాగే.. అయ్యప్ప మాల వేసుకుని కొండకెళ్లొచ్చిన ప్రతీ భక్తుడూ.. తెచ్చిన ప్రసాదాన్ని పదిమందికీ పంచిపెట్టడం ఒక ఆనవాయితీ.

శభరిమలై అరవణ పాయసం లెక్కే వేరు….

శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాదాల్లో అరవణ పాయసం ఒకటి. రుచిలో గానీ.. పరిమళంలో గాని దాని ప్రత్యేకతే వేరు. అన్నం, బెల్లం, కొబ్బరి పాలతో తయారు చేసిన సంప్రదాయ తీపి వంటకమే.. అరవణ పాయసం. శబరిమలై ఆలయం ద్వారా ట్రస్టుకొచ్చే ఆదాయంలో మూడో వంతు ప్రసాదం అమ్మకాల నుంచే వస్తోంది. మకర జ్యోతి సీజన్‌లో రోజుకు సగటున 3 లక్షల డబ్బాల అయ్యప్ప ప్రసాదం అమ్ముడౌతోంది. మాలధారులు ఒక్కొక్కరు కనీసం మూడు డబ్బాలైనా కొనుగోలు చేసి.. దీక్ష విరమణ తర్వాత బంధుమిత్రులకు పంచిపెడతారు. అందుకే.. శబరిమలై అనగానే అయ్యప్పస్వామి తర్వాత వెంటనే గుర్తుకొచ్చేది మహా ప్రసాదం.. అరవణ పాయసమే.

అన్నవరం ప్రసాదంకు స్పెషల్ ఫ్యాన్స్

ఆలయాల్లో ప్రసాదం అనగానే పులిహార, దద్దోజనం.. లేదంటే లడ్డూలు ఇవే గుర్తొస్తాయి. కానీ, అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అందించే ప్రసాదం మాత్రం విభిన్నం.. విశిష్టం. పవిత్రం, పుణ్యంతో పాటు రుచి విషయంలో కూడా అద్బుతః అనాల్సిందే. అందుకే.. అన్నవరం ప్రసాదం కూడా మహాప్రసాదాల జాబితాలో చేరింది. తరతరాలుగా.. స్వామి వారికి గోధుమలతో తయారుచేసిన హల్వా లాంటి ప్రత్యేకమైన పదార్ధాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

అన్నవరం ప్రసాదానికి సంబంధించి ఆసక్తికర ఫ్లాష్‌బ్యాక్‌లు అనేకం. కొన్ని జాతీయ రోడ్డు-రైలు మార్గాలు అన్నవరం మీదుగా వెళుతుంటాయని, వీటి నిర్మాణంలో పనిచేసే ఉత్తరాది కూలీలు గోధుమలతో చేసిన ఆహారం తింటారని, వాళ్ల ఆహార పదార్థాల్లో ఒకటైన ఈ వంటకాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టడం మొదలైందని స్థానికుల కథనం. ఆలయ ప్రధాన అర్చకుల వెర్షన్ మరోలా ఉంది. స్కంధ పురాణంలో అన్నవరం ప్రసాదం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉందట. అరటిపండు, నెయ్యి, పాలు, గోధుమ సత్యనారాయణ స్వామికి ప్రీతిపాత్రమైనవి గనుక వాటితోనే ప్రసాదం చేస్తారట. గోధుమ నూకకి పంచదార, నెయ్యి కలిపితే వచ్చే రుచి అమోఘం. అందుకే.. అన్నవరం సత్యదేవుని దర్శనం తర్వాత ప్రసాదం కోసం ఎగబడతారు భక్తులు. ఏటా 1 కోటీ 50 లక్షల ప్రసాదం ప్యాకెట్లు అమ్ముడౌతుంటాయి.

మంత్రాలయం ప్రసాదం అమోఘం…

కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధి పుణ్యక్షత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఘుమఘుమలాడే సుగంధ పరిమళ ప్రసాదం కూడా మహా ప్రసాదమే. దేశదేశాల నుంచి వచ్చే భక్తులు.. తుంగభద్రనదిలో పుణ్య స్నానమాచరించి, గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని, రాఘవేంద్రస్వామి జీవ సమాధిని సందర్శిస్తారు. తర్వాత శ్రీమఠం పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ వెంటనే క్యూలైన్లో నిలబడి మఠానికి సంబంధించిన పరిమళ ప్రసాదాన్ని స్వీకరిస్తారు.

రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన గోశాలలో ఉండే వందలాది గోవుల శుద్ధమైన నెయ్యి, రవ్వ, పచ్చ కర్పూరం, ఇలాచి పొడి, ద్రాక్ష, చెక్కర, లవంగం, గోడంబి.. ఇలా అనేక రకాల పదార్థాలతో తయారౌతుంది మంత్రాలయం మహా ప్రసాదం.

శ్రీశైలం లడ్డూ గురించి చెప్పేది ఏముంది…?

ఇల కైలాసం శ్రీశైల మహాక్షేత్రం… భ్రమరాంబికా మల్లికార్జున స్వా మి దర్శనానికి వెళ్లే భక్తులందరికీ ప్రీతిపాత్రమైనది అక్కడ నివేదించే మహా ప్రసాదం. ఉదయం పూట విక్రయించే పెద్ద లడ్డూలు మల్లికార్జునుడి మహా ప్రసాదంలో ప్రత్యేకమైనవి. ఆలయానికి ఆగ్నేయ భాగంలో ఉండే లడ్డు పోటులో ఇవి తయారౌతాయి.

లడ్డూలతో వడ, పులిహార, దద్దోజనం కూడా శ్రీశైలం ప్రసాదాల జాబితాలో ఉంటాయి. కానీ.. భక్తులు ఎక్కువగా లడ్డూల వైపే మొగ్గు చూపుతారు. 100 గ్రాములు బరువున్న చిన్న లడ్లు రోజుకు గరిష్టంగా 60 వేల దాకా అమ్ముడౌతాయి. ఇదిలా ఉంటే… స్వామివారికి, అమ్మవార్లకు వేరువేరుగా 25 కిలోల చొప్పున పులిహార నివేదించి.. భక్తులకు పస్రాదంగా పంచిపెడతారు. ప్రస్రాదాల తయారీకోసం ఆలయ ప్రాంగణంలో వేరువేరు వంటశాలలు ఉంటాయి. స్వామివారికి వీరశైవ జంగమలు, అమ్మవారికి బ్రాహ్మణులు ప్రసాదాల్ని విడివిడిగా తయారుచేస్తారు.

వేములవాడ ప్రసాదం.. భక్తులకు మహద్భాగ్యం

సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు.. స్వామివారి ప్రసాదం లడ్డూలను మహద్భాగ్యంగా భావిస్తారు. స్వామి వారి లడ్డూల్ని భక్తులు ఇష్టంగా తినడమే కాదు. తీసుకెళ్లి.. తమ బంధుమిత్రులకు, సన్నిహితులకే కాదు.. వీలైనంత ఎక్కువమందికి పంచి పెడతారు. వేములవాడ సన్నిధిలో తయారయ్యే కిలో లడ్డు కోసం 650 గ్రాములు నెయ్యి, రెండు కిలోల పంచదార, 75 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల కిస్మిస్ వాడతారు. వీటికి యాలకులు, పచ్చకర్పూరం, జాజికాయ అదనం. లడ్డూల ప్రసాదాల తయారీలో ప్రతినెలా పదిహేను వేల కిలోల నెయ్యి ఖర్చవుతుంది. వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రసాద వితరణ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. లడ్డు ప్రసాదాల అమ్మకంతో ఆలయానికి ఏటా 20 కోట్ల ఆదాయం వస్తుంది.

యాదగిరిగుట్ట ప్రసాదానికీ ప్రాముఖ్యత

తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం.. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి.. రోజుకు కనీసం 30 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. యాదాద్రి ప్రసాదానిక్కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. రుచి-శుచిలో తిరుపతి లడ్డు తర్వాతి స్థానం యాదాద్రి నరసన్న లడ్డూదే. యాదాద్రి ఆలయంలో ప్రతిరోజు 22వేల లడ్డూలు తయారౌతాయి. బూంది ఫ్రయర్‌, షుగర్‌ సీరప్‌ మిషన్‌, దాల్‌ పల్వరైజర్‌, గ్రైండింగ్‌ మిషన్‌, చక్కెర సైలోస్‌ మిషన్‌.. ఇలా అధునాతన యంత్రాలలో స్వామివారి లడ్డూ ప్రసాదం తయారౌతుంది. యాదాద్రి ఆలయంలో ప్రసాద తయారీ కోసం నెలకు 30 వేల కిలోల నెయ్యి వాడతారు. మూడు దశల్లో నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే నెయ్యిని వంటశాలకు పంపుతారు. అందుకే.. యాదాద్రి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత విశ్వాసంతో, ఇష్టంగా స్వీకరిస్తారు.

సింహాచలం అప్పన్న ప్రసాదం.. తింటే జన్మధన్యం… 

నిత్య చందనదారుడైన సింహాద్రి అప్పన్న సన్నిధి.. మహావిష్ణువు లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలసిన పుణ్యక్షేత్రం.. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య లక్షకు పైమాటే. స్వామివారి మొక్కులు చెల్లించుకుని.. ప్రసాదాలు స్వీకరించాకే వెనుదిరుగుతారు. బాల భోగంలో నివేదించే పులిహోర ప్రసాదం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రం. సింహాచలంలో ప్రసాదాల తయారీ కోసం వైష్ణవ స్వాములతో ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. అన్నదాన సత్రంలోని పైఫ్లోర్లలో అత్యంత నిష్ట, నిబద్ధతలతో దిట్టం ప్రకారం ప్రసాద తయారీ జరుగుతుంది. సింహాచలం దర్శనానికి వెళ్ళామని చెప్పగానే.. పులిహోర ప్రసాదం కోసం బంధువులు, సన్నిహితులు ఆశగా అడుగుతారు. అందుకే.. సింహాచలం పులిహోర ప్రసాదం… ఉత్తరకోస్తాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా విశిష్టం.

అది తిరుపతి లడ్డూ కావొచ్చు.. శబరిమలై అరవణ పాయసం కావొచ్చు.. సింహాచలం పులిహోర కావొచ్చు.. అన్నవరం గోధుమ నూక ప్రసాదం కావొచ్చు.. ప్రసాదం ఏదైనా సరే.. చిటికెడంతైనా సరే.. అరచేతిలో పెట్టగానే ఆర్తిగా తీసుకుని, కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని తన్మయత్వం పొందడం సరాసరి భక్తుడి సెంటిమెంట్. అందుకే.. ప్రసాదాల్లోకెల్లా ఇవి రాజప్రసాదాలు.. మహా ప్రసాదాలయ్యాయి. ముక్తిమార్గంలో దగ్గరిదారులయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..