ఏపీలో నందీశ్వరుడు జన్మస్థల క్షేత్రంగా మహానంది ఆలయం ప్రసిద్ది. ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 3వ తేదీ శుద్ధ పాడ్యమి నుంచి 12వ తేదీ దశమి వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తూన్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయంలో ప్రతి రోజు ఉదయం శ్రీకామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామి సుప్రభాత సేవతో పూజలు మొదలై తదనంతరం విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చన, మహా మంగళ హారతులు, సహస్ర నామార్చన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మహా నివేదన, మంత్ర పుష్ప సేవలు జరగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం ఈ పది రోజు నిర్వహించనున్నారు.
దసరా నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రీ దుర్గ అలంకరణలో, రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గ, మూడవ రోజు చంద్రఘంటా దుర్గ, నాలుగవ రోజు కుష్మాండ దుర్గ, ఐదవ రోజు స్కందమాతా దుర్గ, అరవ రోజు కాత్యాయని దుర్గ, ఏడవ రోజు కాళరాత్రి దుర్గ, ఎనిమిదవ రోజు మహా గౌరి దుర్గ, తొమ్మిదవ రోజు సిద్దిధాత్రి దుర్గ చివరి రోజైన పదవ రోజు కామేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్.టి.సి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసారు. ఆలయ అధికారులు సైతం ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిల్లు ఏర్పాటు చేశారు.
12వ తేదీన మహానంది క్షేత్రంలోని ఈశ్వర్ నగర్ లో గల జమ్మిచెట్టు వద్దకు ఆలయ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి శమీ దర్శనంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..