దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మవారు నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శినమిచ్చారు. నేడు విజయదశమి సందర్బంగా నేడు కనక దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. దీంతో భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి కొండకు పోటెత్తారు.
చిరునవ్వుతో చెరుకుగడను వామ హస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదించే తషరూపంతో షోడ శాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి నాడు దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ రాజరాజేశ్వరి దర్శనార్ధం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.
శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరిఘట్టమైన తెప్పోత్సవం తో దసరా ముగియనున్నాయి. అయితే కృష్ణ నది లో వరద ఉధృతి అధికంగా ఉన్నందున తెప్పోత్సవాన్ని ఆలయాధికారులు రద్దు చేశారు. నది తీరంలోనే ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..