Kailash Temple in Ellora: ఔరంగజేబు వేల సైన్యాన్ని పెట్టి 3 ఏళ్ళు కష్టపడినా ధ్వంసం కాని ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..!

|

Jan 29, 2021 | 1:07 PM

ఎన్నో మిస్టరీస్ కు నెలవు మహారాష్ట్రలోని కైలాష్ టెంపుల్.. ఈదేవాలయం పై కన్నువేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మూడేళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసినా ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి...

Kailash Temple in Ellora: ఔరంగజేబు వేల సైన్యాన్ని పెట్టి 3 ఏళ్ళు కష్టపడినా ధ్వంసం కాని ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..!
Follow us on

Kailash Temple in Ellora: హిందువులను, హిందూ సంస్కృతిని నాశనం చేసేందుకు యధాశక్తి కష్టపడ్డ రారాజుల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. షాజహాన్ కుమారుడు ఔరంగజేబు క్రీ.శ. 1650 నుంచి 1707 వరకు ఢిల్లీ రాజధానిగా చేసుకొని భారత దేశాన్ని పరిపాలించాడు.. తాను అనుకొన్నది సాధించడానికి ఎటువంటి పనిని చెయ్యడానికైనా వెనుకాడని రాజు.. ఔరంగజేబు. అతని కన్ను పడ్డ  దేవాలయం ధ్వంసం కావాల్సిందే.. ఆలయ సంపద దోచుకోవలసిందే.. కానీ ఔరంగజేబు కన్ను పడ్డ ఆలయాలన్నీ ధ్వంసం అయ్యాయి.. ఒక్క ఆలయం తప్ప… అన్నీ ఆలయాలను ద్వంసం చేసినట్లే కైలాస ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు.. కానీ మూడేళ్లు కష్టపడ్డా ఇటుక కూడా కదిలించలేకపోయాడు.. అటువంటి అద్భుతకట్టడమైన కైలాస దేవాలయం ఎక్కడున్నదో తెలుసా..! ఆలయం పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈ ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మిస్టరీలో ఒకటి మన ఇండియాలోనే ఉంది. అదే.. కైలాశ ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు సమీపంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఉంది ఈ ఆలయం. గుహ అంటే దేవాలయం బయటకు కనిపించదు.. లోపలికి ఉంటుంది అని భావించవద్దు.. కైలాస టెంపుల్ ఇటుకలతోనూ.. రాళ్ళతోనూ కట్టిన కట్టడం కాదు.. పూర్తిగా ఒక కొండను తొలచి ఆలయంగా నిర్మించారు. ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం 4 లక్షల టన్నుల రాతిని తొలిచారు.. కానీ అంతపెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకొని రావాలంటే.. అప్పటి రోజులను బట్టి కనీసం 200 ఏళ్ళు కావాలి.. కానీ కేవలం 18 ఏళ్లలో గుహను గుడిగా మలిచారు. 4 లక్షల టన్నులంటే ఏడాదికి 22,222 టన్నుల రాయి.. అంటే రోజులో 12 గంటలు పనిచేసినా.. 60 టన్నుల రాయిని.. గంటలో 5 టన్నుల రాయిని తొలిగించాలి.. అదీ ఎలాబడితే అలా కాదు.. ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ.. రాయిని తొలగించాలి.. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో.. అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి. ఈ ఆలయం క్రీ.శ.783లో పూర్తి చేసినట్లు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఈ కైలాశ ఆలయం నిర్మాణం గురించి మరాఠీ ఇతిహాసల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.. దీంతో అతని భార్య శివుడిని ప్రార్థింస్తూ.. తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని చెప్పింది. అంతేకాదు.. ఆలయ గోపురం చూసేవరకు తాను ఉపవాస దీక్షను చేపడతానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి.. అలా నిర్మాణం చేపడితే.. ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పడమే కాదు.. ఆలయ నిర్మాణాన్ని కొండ కింది నుంచి కాకుండా.. పై భాగం నుంచి చెక్కుకుంటూ రమ్మనమని సూచించాడు. ఆలా ముందుగా ఆలయ గోపురం ముందుగా చెక్కి.. రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే, ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని స్థానికుల కథనం.

ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అయితే ఆలయం కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి. ఆలయం నేలకు ఉన్న రంథ్రాలు గాలి, వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చనని అంటారు., అయితే, ఆ రంథ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని క్లోజ్ చేయించింది., గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ కైలాస టెంపుల్ మరో ప్రత్యేకత ఆకాశం నుంచి చూస్తే.. ఎక్స్ ఆకారం లో ఉంటుంది. భూమి మీద నుంచి చూస్తే.. 4 సింహాలు ఎక్స్ (X) ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగి నిర్మితమైనది. ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉన్నది.. అంతేకాదు.. డ్రైనేజ్ వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్ స్టైర్స్ వంటి ఎన్నో అద్భుతాలను రాయిని మలచి చెక్కారు. ఇటువంటి ఆలయం పై ఔరంగజేబు కన్ను పడింది. 1680 లో ఈ కైలాసాలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి 1000 మంది కూలీలను పెట్టాడు.. వీరంతా 3 ఏళ్ళు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు.. కానీ విగ్రహాలకు గాట్లు పెట్టడం తప్ప.. గర్భ గుడి లో కూడా అడుగు పెట్టలేక పోయారు. మూడేళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసినా కైలాస దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయారు. కేవలం 5 శాతం మాత్రమే నాశనం చేయగలిగారని తెలుస్తోంది. ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి.