Medaram Maha Jathara: పండుగలొచ్చాయంటే సెలవొస్తుంది..ఇది కామన్.. కానీ కొట్లాది మంది నమ్మకానికి ప్రతీకైనా ఆ మహాజాతరకు మాత్రం ఒక్కపూటైనా అధికారిక సెలవుండదు(Holiday).. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పది రోజులు.. దసరాకు పదిరోజులు.. అన్ని మతాల పండుగలు, ప్రముఖుల జయంతి, వర్థంతి వేడుకలకు అధికారిక సెలవులు ఉంటాయి. కానీ కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన మేడారం మహాజాతరకు మాత్రం ప్రభుత్వం అధికారిక సెలవులు ఇవ్వడం లేదు. జాతీయ హోదా(National Status)కోసం పోటీ పడుతున్న ఆజాతరకు ప్రభుత్వం ఎందుకు సెలవివ్వదనేదే ఆదివాసీలు, భక్తుల ప్రశ్నిస్తున్నారు.
రెండేళ్లకొకసారి వచ్చే సమ్మక్క – సారలమ్మ జాతర నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు మేడారం చేరుకుంటారు.. ఆ నాలుగు రోజులు మేడారం కుగ్రామం జనారరణ్యంగా మారి పోతుంది.. ఆ నాలుగు రోజులు కోటిమంది భక్తులు వన దేనతలను దర్శించుకొని పరవశించిపోతుంటారు.. ఎడ్ల బండ్ల నుండి హెలికాప్టర్ ప్రయాణం వరకు లక్షలాది మంది మేడారం పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు..
ప్రభుత్వం కూడా ఏ పండుగకు అంగు ఆర్భాటం, కోట్లాది రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఇక్కడే వాలిపోతారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు సైతం వనదేవతల సేవలో తరిస్తారు. కానీ జాతర జరిగే నాలుగురోజులలో ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారిక సెలవు ఇవ్వదు. తల్లుల దర్శనానికి వెళ్లాలంటే ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా వ్యక్తిగత సెలవులు పెట్టుకుని వెళ్లాల్సిందే. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతర, తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు అధికారిక సెలవులు ఇవ్వకపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మేడారం పూజారులు, ఆదివాసి సంఘాలు, భక్తులు జాతర కచ్చితంగా జాతర జరిగే నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
జాతర సమయంలో అధికారిక సెలవులు లేకపోవడంతో చాలామంది ముందస్తు దర్శనాలు చేసుకుంటున్నారు. సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చి వనదేవతల దర్శనం చేసుకుంటుంటారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతోమంది ప్రముఖులు జాతరలో పాల్గొంటారు. ఇంతపెద్ద జాతరకు అధికారిక సెలవులు ఇవ్వకపోవడం దారుణం అంటున్న భక్తులు.. ప్రభుత్వం ఈసారైనా సెలవులు ప్రకటించాలని కోరుతున్నారు. మేడారం మహా జాతరకు జాతీయ హోదా కల్పించాలని కొట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం… రాష్ట్ర పండగైన మేడారం జాతరకు సెలవులు ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సరైనా ప్రభుత్వం స్పందించి సెలవులు ప్రకటిస్తుందని భక్తులు ఆశిస్తున్నారు.
–పెద్దీష్, టీవీ 9 ప్రతినిధి, ఉమ్మడి వరంగల్ జిల్లా.
Read Also… Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..