ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం.. ఎక్కడున్నాయో తెలుసా?

భారతదేశంలో అనేక ఆచార, సంప్రదాయాలు అమలులో ఉన్నాయి. వివిధ రాష్ట్రాలలోని ఆలయాల్లో దేవీదేవతలకు సమర్పించే నైవేద్యాలలో కూడా తేడాలుంటాయి. చాలా ఆలయాల్లో శాఖాహార పదార్థాలనే నైవేద్యంగా సమర్పిస్తుండగా.. కొన్ని ప్రత్యేక ఆలయాల్లో మాత్రం మాంసాహారాన్ని నైవేద్యంగా పెడతారు. కొన్ని చోట్ల మద్యాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం.. ఎక్కడున్నాయో తెలుసా?
Temples Prasad

Updated on: Dec 27, 2025 | 6:20 PM

భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆచార, సంప్రదాయాలు అమలులో ఉంటాయి. పండగలు, పూజలు, ఉపవాసాలు చేసే సమయంలో, ఆలయాలకు వెళ్లే సందర్భంలోనూ చాలా మంది భక్తులు సాత్విక, శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాంసాహారం కూడా భుజిస్తారు. అంతేగాక, కొన్ని ఆలయాల్లో దేవీదేవతలకు కూడా మాంసాహారం నైవేద్యంగా పెడతారు.

ఆయా ఆచారాలకు మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక కారణాలు ఉంటాయి.

మునియాండి స్వామి దేవాలయం

తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా వడక్కంపట్టి గ్రామంలోని మునియాండి స్వామి ఆలయంలో మునియాడిని (మునీశ్వరుడు అని పిలువబడే శివుని అవతారం) పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మూడు రోజుల వార్షిక పండుగ జరుపుకుంటారు. ఈ ఆలయంలో చికెన్, మటన్ బిర్యానీని ప్రసాదంగా వడ్డిస్తారు. బిర్యానీ ప్రసాదం కోసం ఉదయమే భక్తులు ఆలయానికి తరలివస్తారు.

విమల ఆలయం

విమల లేదా బిమల (దుర్గాదేవి అవతారం) అమ్మవారి పూజ సమయంలో మాంసం, చేపల నైవేద్యాలతో పూజిస్తారు. ఈ ఆలయం ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీలోని జగన్నాథ ఆలయ సముదాయంలో ఉంది. ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటి. దుర్గా పూజ సమయంలో ఆలయంలోని పవిత్ర మార్కండ సరస్సులో చేపలను పట్టుకుని వచ్చి ఆ వంటకాన్ని నైవేద్యంగా పెడతారు. మరోవైపు మేకను బలి ఇచ్చి దాని మాంసాన్ని వండి నైవేద్యంగా పెడతారు. ఈ రెండింటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అయితే, ఇది జగన్నాథుని ఆలయం తలుపులు తెరవని సమయంలో జరుగుతుంది.

తార్కుల్లా దేవి ఆలయం

భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా ఖ్యాతికెక్కిన ఉత్తరప్రదేశ్‌ని గోరఖ్‌పూర్‌లోని తార్కుల్లా దేవి ఆలయంలో కిచ్డి మేళా జరుగుతుంది. చైత్ర నవరాత్రుల సమయంలో దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మేకలను బలి ఇచ్చి వాటి మాంసాన్ని మట్టి కుండలో వండుతారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

పార్సినిక్ కడవు దేవాలయం

కేరళలోని పార్సినిక్ కడవు దేవాలయం ముత్తప్పన్‌కు అంకితం చేశారు. ముత్తప్పన్ కలియుగంలో జన్మించారు. విష్ణువు, శివుడి అవతారంగా ఆయనను పరిగణిస్తారు. దక్షిణ భారతదేశంలో ఆయనను అనేక పేర్లతో కొలుస్తారు. ఇక్కడ కాల్చిన చేపలు, కల్లును ముత్తప్పన్‌కు ప్రసాదంగా సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.

కాళీఘాట్ ఆలయం

పశ్చిమబెంగాల్‌లోని కాళీఘాట్ దేవాలయం దేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటి. 200 ఏళ్ల పురాతన ఆలయం. ఇక్కడ కాళీ దేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు మేకలను బలిస్తారు. బలి తర్వాత ఆ మాంసాన్ని వండుకుని భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

కామాఖ్య ఆలయం

అస్సాంలోని కామాఖ్య ఆలయం ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. అస్సాంలోని నీలాచల్ పర్వతాలలో ఉంది. ఈ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ అమ్మవారికి రెండు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. శాఖాహారంతోపాటు మాంసాహారం కూడా నైవేద్యంగా నివేదన చేస్తారు. అయితే, వీటిని ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు. మేక మాంసం, చేపల చట్నీని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో ఈ నైవేద్యాన్ని దేవతకు సమర్పిస్తారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం మూసివేస్తారు.

తారాపీఠ్ ఆలయం

పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలోని తారాపీఠ్ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉన్నారు. ఇక్కడ భక్తులు మాంసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మాంసంతోపాటు మద్యం కూడా నైవేద్యంగా పెడతారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

ధక్షిణేశ్వర్ కాళీ ఆలయం

పశ్చిమబెంగాల్లోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయం ఒక ప్రసిద్ధ శక్తిపీఠం. ఈ ఆలయంలో చేపలను నైవేద్యంగా దేవతకు సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అయితే, ఈ ఆలయంలో ఎలాంటి జంతువులను బలి ఇవ్వరు.