మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఖాయం

Maha Shivaratri 2026 Time and Puja Vidhi: శివ పురాణం ప్రకారం, మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించాడని చెబుతారు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే.. మన శరీరమనే చీకటిలో ఉన్న ఆత్మరూపమైన వెలుగును తెలుసుకోవడం. ఈరోజు చేసే పూజల ద్వారా పొందే ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ఖాయం
Maha Shivaratri

Updated on: Feb 14, 2026 | 4:55 PM

మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ రోజు పరమశివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర దినాన భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధిస్తే పాపాలు తొలగి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేసి, అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివ పురాణం ప్రకారం, మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించాడని చెబుతారు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే.. మన శరీరమనే చీకటిలో ఉన్న ఆత్మరూపమైన వెలుగును తెలుసుకోవడం. ఆత్మే భగవంతుని స్వరూపమని గ్రహించడం మహాశివరాత్రి సందేశం.

శివరాత్రి సందర్భంగా దీపం వెలిగించి..

“జ్వాలాయ నమః, జ్వాలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః” అనే మంత్రాలను జపిస్తే శివకృప త్వరగా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

మహాశివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు

సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి.
కోపం లేకుండా ప్రశాంతంగా గడపాలి.
అందరితో ప్రేమగా “శివ శివ” అంటూ సంభాషించాలి.
గురువును పూజించడం ఎంతో శ్రేయస్కరం. గురువు శరీరాన్నే ‘ఆకార లింగం’గా భావిస్తారు.
భస్మధారణ చేయాలి.
పురుషులు తడి విభూతి, స్త్రీలు పొడి విభూతి ధరించడం శాస్త్రోక్తం.
తెలుపు రంగు వస్త్రాలు ధరించి, తెల్లని పుష్పాలతో పూజ చేయడం శుభప్రదం.
నైవేద్యంగా కొబ్బరి, కొబ్బరిఅన్నం, పాయసం వంటి తెల్లని పదార్థాలు సమర్పించడం మంచిది.

శివపూజ విధానం

శివ పురాణం ప్రకారం.. ఈ రోజున పార్థివ లింగ పూజ (మట్టితో చేసిన శివలింగానికి పూజ) చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆవు నెయ్యి కలిపిన మట్టితో శివలింగం తయారు చేసి పూజిస్తే మరింత శ్రేయస్సు లభిస్తుందని అంటారు.

పూజ అనంతరం ఆ మట్టి శివలింగాన్ని నదిలో లేదా పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. లేక మొక్కల వద్ద ఉంచవచ్చు. పార్థివ లింగ పూజ సాధ్యం కాకపోతే, ఏ లోహంతో లేదా ఇతర పదార్థాలతో చేసిన శివలింగానికైనా భక్తి భావంతో పూజ చేయవచ్చు.

అదనంగా, మారేడు చెట్టు దగ్గర ఆవుపాలతో చేసిన పాయసం శివభక్తుడికి అందించడం, ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం శుభఫలితాలను ఇస్తుందని పేర్కొంటారు.

శివపూజకు ఉత్తమ సమయం

మహాశివరాత్రి (ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న) సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం సూర్యోదయం వరకు అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో శివుని లింగరూప ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ చేసే అభిషేకం, జపం ఎంతో ఫలప్రదమని విశ్వసిస్తారు. ఆ సమయంలో భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ పూజలు చేస్తే శివానుగ్రహం త్వరగా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అంతేగాక, పాపాలు, దారిద్ర్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాలు, సకల సంతోషాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)