ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొత్త సంవత్సరంలో భారీ జాతర జరగనుంది. గంగమ్మ నదీ తీరంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభ మేళాను జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన వేడుకలో ప్రకటన హక్కులను హైదరబాద్ కు చెందిన శ్రేయాస్ మీడియా (ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్ విభాగం) చేజిక్కించుకుంది. ఈ విషయాన్నీ భారతదేశపు ప్రీమియర్ సేల్స్ , మార్కెటింగ్ పవర్‌హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కార్యక్రమం మహా కుంభ మేళాను నిర్వహించే ప్రాంతంలో ప్రకటనలతో పాటు వెండింగ్ జోన్‌లు, అమ్యూజ్‌మెంట్ జోన్, ఫుడ్ కోర్ట్‌తో సహా పలు ఇతర కార్యకలాపాల హక్కులను కూడా తమకే దక్కినట్లు పేర్కొంది.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా కుంభ మేళాను దాదాపు 4,000 హెక్టార్ల ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు 50 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ మేళాలో తమ వస్తు, సేవలను తెలియజేస్తూ ఇచ్చే యాడ్స్ కోసం కార్పొరేట్ రంగం భారీగా ఖర్చు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో భారతీయ కంపెనీలు రూ.3,000 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
6,300 కోట్ల అంచనా బడ్జెట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మహా కుంభ మేళా 2025లో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు. 2025 సంవత్సరంలో ఇదే మెగా ఈవెంట్ గా చరిత్రలో నిలిచి పోయే గొప్ప కుంభమేళా అవుతుందని అధికారులు చెబుతున్నారు.
మహా కుంభ మేళాలో యాడ్స్ హక్కులను పొందిన శ్రేయాస్ మీడియాకు సంబందించిన ఇతర కార్యకలాపాలపై శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సెక్టార్ 1లోని అమ్యూజ్‌మెంట్ జోన్ మహా కుంభ మేళాలో 2025 హైలైట్‌లలో ఒకటిగా ఉంటుందని చెప్పారు. ఈ అమ్యూజ్‌మెంట్ జోన్‌లో వినోద కార్యక్రమాలు, ఆకర్షణీయమైన సౌకర్యాలు ఉంటాయి. జెయింట్ వీల్, రాకింగ్ చైర్, మినీ రైలు మొదలైనవి. ఈ జోన్‌లో బట్టల షాప్స్ తో సహా 145 దుకాణాలు కూడా ఉంటాయి. మతపరమైన, బుక్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కంపెనీ హనుమాన్ దేవాలయం సమీపంలో ఫుడ్ కోర్ట్‌ను కూడా నిర్వహిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా లభించే విన్నమైన ఆహార పదార్ధాలను, రకరకాల భారతీయ రుచులను అందిస్తుందని చెప్పారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.