Sri Veerabrahmendra Swamy Jayanti: కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు

Sri Veerabrahmendra Swamy Jayanti: మహాయోగి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆరాధనీయులు. ఆయన రాసిన “కాలజ్ఞానం” ద్వారా అనేక భవిష్యవాణులు ప్రసిద్ధి చెందాయి. దేశంలో జరిగే అనేక సంఘటనలను ఆయన ముందే చెప్పారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున ఆయన జయంతి జరుపుకుంటారు. అదే రోజున ఆయన సజీవ సమాధిలో ప్రవేశించిన పవిత్ర దినంగా కూడా భావిస్తారు.

Sri Veerabrahmendra Swamy Jayanti: కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
Sri Veerabrahmendra Swamy Jayanti

Updated on: Apr 26, 2026 | 10:37 AM

Sri Veerabrahmendra Swamy Jayanti: మహాయోగి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. దేశంలో, ప్రపంచంలో ఏ వింత జరిగినా.. బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
“కాలజ్ఞానం” కారణంగా ప్రజల భక్తి విశ్వాసాన్ని పొందిన మహాయోగి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు సమాజంలో అత్యంత ఆరాధనీయులుగా నిలిచారు. వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతిని ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున జరుపుకుంటారు. ఈ రోజే (ఏప్రిల్ 26) ఆయన సజీవ సమాధిలో ప్రవేశించిన పవిత్ర దినంగా కూడా భావించబడుతుంది. అందుకే జననం, సిద్ధి రెండింటినీ గుర్తుచేసుకుంటూ భక్తులు ఈ దినాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు.

జన్మ కథ

పురాణ కథనాల ప్రకారం గంగా తీర ప్రాంతానికి చెందిన విశ్వబ్రాహ్మణ దంపతులు పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబలు సంతాన ఆశతో కాశీకి వెళ్లారు. అక్కడ వారికి దైవ సంకేతం ద్వారా మహాశివుడు కలలో ప్రత్యక్షమై, భవిష్యత్తులో దివ్యమైన కుమారుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. అనంతరం మార్గమధ్యంలో సరస్వతీ నది సమీపంలో, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించారు. ఆయన జననం తర్వాత తండ్రి మరణించగా, తల్లి అత్రి మహర్షి ఆశ్రమంలో బిడ్డను అప్పగించి తన జీవితం ముగించిందని చెప్పబడింది.

బాల్యం – విద్యా ప్రయాణం

తర్వాత కర్నూలు ప్రాంతానికి చెందిన యనమదల మఠాధిపతులు వీరభోజాచార్యులు, వీరపాపమాంబ దంపతుల వద్ద పెరిగిన బ్రహ్మం గారు చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపారు. శాస్త్రాలు, తత్వజ్ఞానం, భక్తి భావనలు నేర్చుకొని, బాల్యంలోనే శక్తివంతమైన ఆధ్యాత్మిక రచనలు చేసినట్లు చెబుతారు. తండ్రి మరణం తరువాత మఠాధిపత్యాన్ని స్వీకరించకుండా, తల్లి ఆశీస్సులతో దేశాటనకు బయలుదేరారు. ఈ ప్రయాణంలో ప్రజలతో మమేకమై జీవన సత్యాలను తెలుసుకున్నారు.

కాలజ్ఞానం రచన

బనగానపల్లె ప్రాంతంలోని పశువుల కాపరిగా జీవించిన సమయంలో కూడా ఆయన నిరంతరం ధ్యానం చేస్తూ “కాలజ్ఞానం” రచనను ప్రారంభించారు. రవ్వలకొండ గుహల్లో వ్రాసిన తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ పవిత్రంగా భద్రపరచబడ్డాయని విశ్వాసం ఉంది.

కుటుంబ జీవితం, శిష్యులు

గోవిందమ్మను వివాహం చేసుకుని కుటుంబ జీవితం గడిపినప్పటికీ, ఆధ్యాత్మిక మార్గాన్ని వదలలేదు. కుల, మత భేదాలను అధిగమిస్తూ ఒక ముస్లిం యువకుడిని శిష్యుడిగా స్వీకరించి అతనికి “సిద్ధయ్య” అనే పేరు ఇచ్చి జ్ఞానబోధ చేశారు.

కక్కయ్యను శిష్యునిగా చేసుకోవడం

బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య, కుండలినీ శక్తి, శరీరంలోని యోగచక్రాల గురించి వివరిస్తూ, “మన శరీరం ఒక దేవాలయం. అందులో దైవ శక్తులు ఉంటాయి. కుండలినీ శక్తిని జాగృతం చేస్తే ఆ దైవ శక్తులను దర్శించవచ్చు” అని బోధిస్తున్నారు. ఆ సమయంలో కక్కయ్య అనే వ్యక్తి ఆ మాటలు విన్నాడు. కక్కయ్యకు శరీరంలోని అద్భుతాలు చూడాలనే ఆసక్తి పెరిగింది. వెంటనే ఇంటికి వెళ్లాడు. అక్కడ తన భార్య నిద్రిస్తుండటం చూసి, ఆమె శరీరంలో దేవతలను చూడాలనే భ్రమతో, ఆమెను చంపి శరీరాన్ని పరిశీలించాడు. కానీ అక్కడ రక్తమాంసాలు తప్ప మరేమీ కనిపించలేదు. తాను మోసపోయానని భావించి తీవ్రంగా బాధపడ్డాడు. తనను బ్రహ్మంగారి మాటలు మోసం చేశాయని, ఆయన తప్పుదారి పట్టించారని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా నిజం తెలుసుకోవడానికి బ్రహ్మంగారి వద్దకు వెళ్లి జరిగిన విషయం మొత్తం వివరించి ఆయనను దూషించాడు.

బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన ఇలా అన్నారు:
“కక్కా, నేను చెప్పింది అసత్యం కాదు. నేను అసత్యం పలకను. నీ భార్యను తిరిగి జీవింపజేస్తాను.” అని చెప్పి కక్కయ్యతో కలిసి అతని ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె శరీరంపై మంత్రజలం చల్లగానే, ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది. దీన్ని చూసి కక్కయ్య బ్రహ్మంగారి మహిమను తెలుసుకున్నాడు. వెంటనే క్షమాపణలు కోరుతూ, తనను శిష్యుడిగా చేర్చుకోవాలని ప్రార్థించాడు.

తరువాతి ప్రయాణం – దేశాటన

కొంతకాలం తరువాత బ్రహ్మంగారు దేశాటనకు బయలుదేరారు. ఆయన ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించి, తర్వాత రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో పర్యటించి చివరకు హైదరాబాద్ చేరుకున్నారు.

హైదరాబాద్ పర్యటన

గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయనను తన వద్దకు ఆహ్వానించాడు. బ్రహ్మంగారు నవాబు దగ్గరకు వెళ్లారు. నవాబు ఆయనను ఉద్దేశించి, “మీరు గొప్ప జ్ఞాని అయినా, దైవాంశసంభూతుడని నమ్మడం కష్టం. ఏదైనా మహిమ చూపిస్తేనే నమ్మగలను” అని అన్నాడు. అప్పుడు బ్రహ్మంగారు ఒక గిన్నెలో నీరు తెప్పించమన్నారు. సేవకుడు తీసుకువచ్చిన నీటితో ఆయన ఒక దీపాన్ని వెలిగించారు. ఈ అద్భుతాన్ని చూసిన నవాబు ఆశ్చర్యపోయి, బ్రహ్మంగారిని పూర్తిగా నమ్మాడు. తర్వాత ఆయనను జ్ఞానబోధ చేయమని కోరాడు. నవాబు అభ్యర్థనపై బ్రహ్మంగారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు.

సజీవ సమాధి ప్రవేశం

తన జీవితం ముగిసే సమయం సమీపించిందని ముందే ప్రకటించిన వీరబ్రహ్మేంద్ర స్వామి, శిష్యులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సజీవ సమాధిలో ప్రవేశించారు. తరువాత భక్తుల ఆర్తనాదాలను విని కరుణతో కొంతసేపు బయటకు వచ్చి చివరి ఉపదేశాలు ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించినట్లు కథనం.

ఆధ్యాత్మిక చైతన్యం

వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు కేవలం భవిష్యవాణులు మాత్రమే కాకుండా సమాజంలో సమానత్వం, ధర్మం, నైతిక జీవనం గురించి మార్గనిర్దేశం చేశాయి. ఆయన రచించిన కాలజ్ఞానం ఇప్పటికీ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు దేశవ్యాప్తంగా భక్తులు ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మఠాలలో ప్రత్యేక పూజలు, భజనలు, స్మరణ కార్యక్రమాలు నిర్వహించి మహాయోగికి నివాళులు అర్పిస్తారు. ఈ రోజున బ్రహ్మంగారి జీవ సమాధి వద్దకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని భక్తిశ్రద్ధలతో ఆయనను పూజిస్తారు. కడప జిల్లా కందిమల్లాయపల్లెలోని బ్రహ్మంగారి మఠంలో జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు వేడుకగా జరుగుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us