
చాణక్య నీతి ప్రకారం తెలివైన వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోరు. అవి బయటకు చెబితే ఇతరులు అవగాహన లేకుండా తక్కువగా చూస్తారు. పైగా ఎగతాళి కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలని చాణక్యుడు సూచించారు. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరిస్థితుల కారణంగా మనకు అప్పులు కావొచ్చు, వ్యాపార నష్టాలు రావొచ్చు లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఎదురవవచ్చు. కానీ ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే మన ఆర్థిక స్థితి బాగా లేదని తెలిసినవారు మొదట సానుభూతి చూపించినా.. తరువాత దూరంగా ఉండే అవకాశం ఉంది. కొందరు ఏకంగా మనపై చెడు అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు.
ఎవరైనా మోసం చేస్తే ఆ బాధను ఇతరులతో పంచుకోవడం అనవసరం. ఇలాంటి విషయాలు చెబితే కొందరు మన బాధను అర్థం చేసుకోకుండా మూర్ఖులమని అనిపించుకోవచ్చు. పైగా మన వైఫల్యాన్ని చూసి ఆనందించే వారు కూడా ఉంటారు. కాబట్టి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడం మంచిది.
జీవితంలో ఏదైనా సందర్భంలో మనం అగౌరవానికి గురైనా, ఎవరైనా అవమానించినా దానిని ఎవరితోనూ చెప్పకూడదు. మనకు మద్దతుగా ఉన్నవారు కూడా మన కష్టాన్ని అర్థం చేసుకున్నప్పటికీ లోలోపల మనల్ని తక్కువగా చూసే అవకాశం ఉంది. కొందరు మనకు నచ్చజెప్పేలా మాట్లాడినా వెనుకపెట్టి వెక్కిరించే అవకాశం ఉంటుంది.
ప్రతి ఇంట్లోనూ చిన్న, పెద్ద సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ గోప్యతను ఇతరులు దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే కుటుంబ సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవడం ఉత్తమం.
చాణక్యుడు చెప్పిన జీవన సూత్రాల ప్రకారం మన వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఇవి బయటపడితే మన గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి దెబ్బ తగిలే అవకాశముంది. తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఈ విషయాలను గోప్యంగా ఉంచుతారని చాణక్య నీతి సూచిస్తుంది.