
సనాతన ధర్మంలో ప్రతి నెలకు ఒక విశిష్టత ఉంది. పుష్య మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన కాలం. ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాలలో పుత్రదా ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏకాదశిని ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులు ఆచరిస్తారు.
ఏడాదికి రెండు పుత్రదా ఏకాదశులు:
పుత్రదా ఏకాదశి ఏడాదిలో రెండుసార్లు వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో రాగా, రెండోది పుష్య మాసంలో వస్తుంది. ఈ వ్రతం చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇది కుటుంబంలో సంతోషాన్ని, సౌభాగ్యాన్ని పెంచడమే కాకుండా వంశాభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ ఉపవాస దీక్షను పాటిస్తారు.
తేదీ – శుభ ముహూర్తం:
పంచాంగ గణన ప్రకారం, పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ ఉదయం 7.50 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది మరుసటి రోజు అంటే డిసెంబర్ 31 ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో సూర్యోదయ తిథికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మెజారిటీ భక్తులు డిసెంబర్ 30న ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. వైష్ణవ సంప్రదాయం అనుసరించేవారు మాత్రం డిసెంబర్ 31న జరుపుకుంటారు.
అరుదైన యోగాలు:
ఈసారి పుత్రదా ఏకాదశి నాడు సిద్ధి, శుభ, రవి యోగాలతో పాటు భద్రవాస యోగం కలవనున్నాయి. ఈ పవిత్ర సమయాల్లో లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
భక్తులు తమ ఇళ్లలో గానీ, సమీపంలోని ఆలయాల్లో గానీ సంప్రదాయ పద్ధతిలో విష్ణువును ఆరాధిస్తారు. ఈ ఆచారం ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించడమే కాకుండా, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను బలోపేతం చేస్తుంది.
(గమనిక: ఈ సమాచారం ప్రజల విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీని ఖచ్చితత్వానికి సంబంధించి సంస్థకు ఎటువంటి బాధ్యత ఉండదు.)