Tirumala: లడ్డు కేంద్రాల్లో చైర్మన్ తనిఖీ చేసిన కొన్ని గంటల్లో భక్తుల అవస్థలు.. లడ్డుల కోసం కౌంటర్లు వద్ద బారులు తీరిన భక్తులు

|

Nov 29, 2022 | 3:01 PM

నిన్న టీటీడీ చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి తిరుమలలో లడ్డు విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా లడ్డు ప్రసాదాలు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఇలా చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి తనిఖీలు చేసిన 24 గంటలు కూడా గడవక ముందే భక్తులు లడ్డుల కోసం అవస్థలు పడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Tirumala: లడ్డు కేంద్రాల్లో చైర్మన్ తనిఖీ చేసిన కొన్ని గంటల్లో భక్తుల అవస్థలు.. లడ్డుల కోసం కౌంటర్లు వద్ద బారులు తీరిన భక్తులు
Tirumala Sri Vari Laddu
Follow us on

తిరుమల తిరుపతి క్షేత్రం అనగానే శ్రీవారితో పాటు.. అందరిమదిలోనూ మెదిలేది శ్రీవారి లడ్డు ప్రసాదం.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే విశిష్టత స్వామివారి లడ్డూకి కూడా ఉంది. దివ్యమంగళుడి రూపుడైన కోనేటిరాయుడి దర్శించుకుని జన్మ ధన్యమైనట్లు భావించే భక్తులు లడ్డు ప్రసాదం కోసం బారులు తీరతారు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఎంత ఫేమస్సో.. తిరుపతి లడ్డులు కూడా అంతే ఫేమస్. తిరుమలకు వెళ్లే భక్తులు మాత్రమే కాదు.. ఆ భక్తులు తీసుకొచ్చే లడ్డుల కోసం ఎంతో ఇష్టంగా అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి లడ్డుకు ఉన్న ప్రత్యేకత అది మరి. అందుకనే స్వామివారి దర్శనం ముగిసిన వెంటనే.. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు క్యూలైన్లలో నిలబడతారు.. ప్రస్తుతం శ్రీవారి సన్నిధిలో భక్తులు స్వామివారి ప్రసాదం లడ్డూల కోసం అవస్థలు పడుతున్నాడు.  సిబ్బంది కొరత ఏర్పడడంతో భక్తులకు లడ్డులను అందించడంలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూ లైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు.

తిరుమల క్షేత్రంలో విధులను నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు KVM సంస్థ గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు తమ విధులను బహిష్కరించారు. దీంతో భక్తులు అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. KVM సంస్థపై టీటీడీ ఎస్మా చట్టం కింద కేసు పెట్టింది. సోమవారం నుంచి భక్తులకు లడ్డులను టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు.  అయినప్పటికీ లడ్డూల పంపిణీకి తగినంత సిబ్బంది లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. లడ్డూల జారీ జాప్యంతో కౌంటర్ల వద్ద  భక్తులు తీవ్ర ఇబ్బందను ఎదుర్కొంటున్నారు.

అయితే నిన్న టీటీడీ చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి తిరుమలలో లడ్డు విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితుల గురించి శ్రీవారి భక్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా లడ్డు ప్రసాదాలు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఇలా చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి తనిఖీలు చేసిన 24 గంటలు కూడా గడవక ముందే భక్తులు లడ్డుల కోసం అవస్థలు పడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లడ్డుల కోసం క్యూ లైన్ లో అవస్థలు పడుతున్న భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని.. భక్తులకు లడ్డులను అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..