AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోరిన కోర్కెలు తీర్చే కుండలేశ్వరస్వామి.. కాశీకి ముందే.. ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే!

కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమానమైన ప్రాముఖ్యత కలిగిన ఆలయం మన తెలుగు రాష్ట్రంలో ఉన్న Kundaleswara Swamy Temple. మార్కండేయ మహర్షి తన చంద్రశేఖరాష్టకంలో ఈ క్షేత్రాన్ని స్తుతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాశీతో సమానమైన పవిత్రత కలిగినందున దీనిని “దక్షిణ కాశీ” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు స్వయంభూ లింగరూపంలో వెలసి ఉన్నాడు. లింగం చెవి కుండలంలా ఉండటంతో స్వామిని “కుండలేశ్వరుడు” అని పిలుస్తారు. అందుకే ఈ ప్రాంతానికి “కుండలేశ్వరం” అనే పేరు వచ్చింది.

కోరిన కోర్కెలు తీర్చే కుండలేశ్వరస్వామి.. కాశీకి ముందే.. ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించాల్సిందే!
Kundaleswara Swamy Temple
Rajashekher G
|

Updated on: Apr 22, 2026 | 3:28 PM

Share

మనదేశంలోని శివాలయాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా కాశీ విశ్వనాథ్ ఆలయం వెలసిల్లుతోంది. అయితే, మన తెలుగు రాష్ట్రంలోనే కాశీతో సరితూగే శివాలయం ఒకటి ఉంది. అదే పార్వతీ సమేత కుండలేశ్వరస్వామి ఆలయం. పవిత్ర గోదావరి నది తీరంలో వెలసిన ఈ కుండలేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. మార్కండేయ మహర్షి తన చంద్రశేఖరాష్టకంలో “కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం” అంటూ ఈ క్షేత్రాన్ని స్తుతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఈ ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉందని తెలుస్తుంది. కాశీకి ఉన్న ప్రాముఖ్యత ఈ క్షేత్రానికీ ఉండటంతో దీనిని ‘దక్షిణ కాశీ’గా కూడా పిలుస్తారు.

ఆలయం స్థానం

ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన ఉంది. ఇక్కడ శివుడు స్వయంభూ లింగరూపంలో వెలసి ఉన్నాడు. ఈ శివలింగం చెవి కుండలంలా ఉండటం వల్ల స్వామిని “కుండలేశ్వరుడు” అని పిలుస్తారు. అందుకే ఈ ప్రాంతానికి “కుండలేశ్వరం” అనే పేరు వచ్చింది.

వృద్ధ గౌతమి మహిమ

ఈ ఆలయం “వృద్ధ గౌతమి” నది తీరాన ఉంది. స్కంద పురాణం ప్రకారం కాశీ యాత్రకు వెళ్లే వారు ముందుగా ఇక్కడ స్నానం చేసి, కుండలేశ్వరుని దర్శించి తర్వాత కాశీకి వెళ్లాలని సూచించబడింది. అందువల్ల ఈ క్షేత్రానికి విశేషమైన పవిత్రత ఉంది.

వ్యాస మహర్షి కథ

వ్యాస మహర్షి కాశీ విడిచి వచ్చిన తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి చెవి కుండలం పడిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోదావరిలో స్నానం చేసి, స్వామిని దర్శించిన వ్యాసుడు కాశీ విశ్వనాథుని దర్శించిన అనుభూతిని పొందినట్లు చెబుతారు.

గోదావరికి లభించిన వరం

వ్యాస మహర్షి గోదావరికి ఒక ప్రత్యేక వరం ఇచ్చారని విశ్వాసం. ఇతర నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే.. వృద్ధ గౌతమికి ప్రతి రోజూ పుష్కర ఫలమే ఉంటుందని ఆయన వరమిచ్చాడట. అందువల్ల ఇక్కడ ఎప్పుడు స్నానం చేసినా పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

గంగమ్మ స్నానం కథనం

పురాణాల ప్రకారం గంగానది భక్తుల పాపాలను తొలగించిన తరువాత ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి తన పవిత్రతను కాపాడుకుంటుందని చెబుతారు.

సముద్రుడి కథ

వృద్ధ గౌతమి సముద్రంలో కలిసే సమయంలో సముద్రుడు రెండు కుండలాలను బహుకరించాడని కథనం. అందులో ఒకటి గర్భంలో దాగి ఉంటే, మరొకటి భూమిపై కుండలేశ్వర స్వామిగా వెలసిందని చెబుతారు. బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు, ఋషులు వచ్చి స్వామిని ఆరాధిస్తారని విశ్వాసం ఉంది.

ఆలయ నిర్మాణం

ఆలయంలోని శివలింగం కుండలం ఆకారంలో ఉంటుంది. గోపురంపై శివుని వివిధ రూపాలు, లీలలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి.

ఉపాలయాలు

ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు, కాలభైరవుడు, వనదుర్గ, వేణుగోపాల స్వామి, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వంటి అనేక ఉపాలయాలు ఉన్నాయి.

పూజలు, ఉత్సవాలు

ప్రతిరోజూ త్రికాల పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం అభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి, హనుమజ్జయంతి, కార్తికమాసం వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కార్తిక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం ప్రత్యేక ఆకర్షణ. అంతేగాక, కుండలేశ్వర స్వామిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

(Disclaimer: వివిధ వనరుల నుంచి సేకరించిన ఈ సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం. సంస్థ దీనిని ధృవీకరించదు.)

Follow Us