Kotappakonda: శివుడు దిగొచ్చేది అప్పుడే… కోటి ప్రభల కోటప్పకొండ రహస్యం తెలుసా..?

Kotappakonda mystery: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ప్రభల ఉత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. త్రికోటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవాలనే భక్తి భావంతో గ్రామాలు గ్రామాలుగా భక్తులు అద్భుతంగా అలంకరించిన భారీ ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి కొండపైకి చేరుకుంటారు. దేశంలోనే అతి పెద్ద శివరాత్రి తిరునాళ్లలో ఒకటిగా పేరు గాంచిన ఈ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.

Kotappakonda: శివుడు దిగొచ్చేది అప్పుడే... కోటి ప్రభల కోటప్పకొండ రహస్యం తెలుసా..?
Maha Shivaratri

Updated on: Feb 15, 2026 | 10:09 AM

పరమశివుని భక్తులకు మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పర్వదినం. సాధారణంగా ఈ రోజున శివాభిషేకాలు, ఉపవాసాలు, జాగారాలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని కోటప్పకొండ వద్ద మాత్రం మహాశివరాత్రి అంటే ప్రత్యేక వైభవం. ఇక్కడ భక్తులు శివునికి “ప్రభలు”తో ఘన స్వాగతం పలకడం ఈ జాతర ప్రత్యేకత. కోటప్పకొండ అంటేనే ప్రభల మహోత్సవం గుర్తుకు వస్తుంది. ప్రభలు లేకుంటే అక్కడి శివరాత్రి సందడి అసంపూర్తిగా అనిపిస్తుంది.

కోటప్పకొండ ప్రభల ఉత్సవం ప్రత్యేకత

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ప్రభల ఉత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. త్రికోటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవాలనే భక్తి భావంతో గ్రామాలు గ్రామాలుగా భక్తులు అద్భుతంగా అలంకరించిన భారీ ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి కొండపైకి చేరుకుంటారు. దేశంలోనే అతి పెద్ద శివరాత్రి తిరునాళ్లలో ఒకటిగా పేరు గాంచిన ఈ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.

భక్తి, ఐకమత్యానికి సంకేతం

కోటప్పకొండ శివరాత్రి సందర్భంగా సమర్పించే ఒక్కో ప్రభ తయారీకి సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. అయినప్పటికీ భక్తులు ఖర్చును ఏమాత్రం లెక్కచేయరు. గ్రామ ప్రజలంతా కలసి విరాళాలు సేకరించి ఈ ప్రభలను నిర్మించడం విశేషం. భక్తి, ఐకమత్యం, గ్రామీణ సాంస్కృతిక స్పూర్తికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.

కనువిందు చేసే భారీ ప్రభలు

పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా ప్రభలను కట్టుకుని కోటప్పకొండకు రావడం ఆనవాయితీ. ఒక్కో ప్రభ వెంట గ్రామమంతా తరలి రావడం ప్రత్యేక దృశ్యం. 80 నుంచి 100 అడుగుల ఎత్తులో విద్యుత్ దీపాలతో మెరుస్తూ నిలిచే ఈ ప్రభలు భక్తులకు కనువిందు చేస్తాయి. రాష్ట్రంలో మరెక్కడా కనిపించని ఈ వైభవం కోటప్పకొండకే ప్రత్యేకం.

ఈ ఉత్సవానికి ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక, గుంటూరు, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన ప్రజలు మాత్రం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శివరాత్రి సందర్భంగా స్వగ్రామాలకు చేరుకుంటారు. విదేశాల్లో స్థిరపడినవారు సైతం ఈ పర్వదినాన్ని సొంతూరిలోనే జరుపుకోవాలని ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ప్రభల ఊరేగింపుల సమయంలో గ్రామాల్లో నెలకొనే భక్తితోపాటు ఆనందోత్సాహాలు చూడముచ్చటగా ఉంటాయి.

కోటి ప్రభలు.. కొండ దిగి వచ్చే శివయ్య

ఒక్క ప్రభ సమర్పించినా శివయ్య అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మహాశివరాత్రి రోజు ఆలయ సమీపంలో వరుసగా నిలిచే ప్రభల దృశ్యం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కోటి ప్రభలు పూర్తయ్యే రోజు శివయ్య స్వయంగా కొండ దిగి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడని స్థానిక నమ్మకం. ఆ మహద్ఘడియ కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)