శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఉత్తాదితో పాటు దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో కావిడి యాత్ర సందడి మొదలవుతుంది. నది జలాన్ని కావిడి కుండల్లో తీసుకుని శివాలయాలకు చేరుకొని హర హర మహాదేవ అంటూ అభిషేకం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మార్వాడి మంచ్ ఆధ్వర్యంలో కావడి యాత్ర ఘనంగా జరిగింది. కావడి యాత్రలో దాదాపు 3 వేల మంది భక్తులు పాల్గొనడంతో విశాఖ కాషాయమయంగా మారింది. ఇంతకీ.. మార్వాడీల కావడి యాత్ర స్పెషల్ ఏమిటంటే?
శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారాన్ని మార్వాడీలు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. శ్రావణమాసంలో మొదటి ఆదివారం ప్రతిఏటా కావడి యాత్ర చేయడం అనవాయితీగా వస్తోంది. అయితే.. ఉత్తరాది రాష్ట్రాల తరహాలోనే విశాఖలోనూ కావడి యాత్రను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే.. విశాఖలో మార్వాడీల కావడి యాత్ర శోభయమానంగా సాగింది. తెల్లవారుజామునే మాధవధార భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి చేరుకున్న మార్వాడీలు.. కాషాయవస్త్రం ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొండల నుంచి జాలు వారుతున్న జలధార నుంచి పవిత్ర గంగా జలాన్ని చిన్నచిన్న కుండలో పట్టుకొని.. కావడి మోశారు. మాధవధార నుంచి బిర్లా జంక్షన్ కంచరపాలెం, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పాండురంగాపురంలోని జగన్నాథస్వామి ఆలయం వరకు సాగింది.
హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో కావడి యాత్ర ముందుకు సాగింది. కిలోమీటర్ల మేర నడిచి ఆ గంగాజలంతో పరమశివుడికి అభిషేకం చేశారు. పాండురంగాపురంలోని పరమశివుడు లింగానికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి యాత్రను ముగించారు. మార్వాడీల్లో లింగ వయసుభేదం లేకుండా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కావడి యాత్రలో పాల్గొన్నారు. పవిత్ర గంగాజలంతో పరమశివుడికి అభిషేకం చేస్తే స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని మార్వాడీలు భావిస్తారు. ఇక.. ఈ యాత్రలో సుమారు 3 వేల మంది భక్తులు పాల్గొన్నారు. కావడి చేతబట్టిన దగ్గర నుంచి కింద పెట్టకుండా యాత్ర మొత్తం పూర్తి చేస్తారు. ప్రతి ఒక్కరూ పాదరక్షలు లేకుండా కాషాయ వస్తాలు ధరించి కావడి యాత్రలో పాల్గొంటారు. శ్రావణమాసంలో ఈ కావడి యాత్ర చేస్తే పరమశివుని అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.