
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి జాతకంలోనైనా దోషాలు ఉంటే అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. పితృ దోషం, శని దోషం, కుజ దోషం లేదా గురు చండాల దోషం వలె, కాల సర్ప దోషం కూడా ముఖ్యమైన , ప్రభావవంతమైన దోషంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలోనైనా ఈ దోషం ఉంటే.. ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు పెరుగుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఫల్యం కలుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు అప్పులు, నష్టాలు, నిరుద్యోగం, అతికోపం, దుర్మార్గపు ప్రవర్తన, అనారోగ్యాలు, గర్భస్రావాలు, పాము కాటు, వ్యభిచారం, త్రాగుడు, జూదం వంటి సమస్యల బారిన పడతారు.
కాల సర్ప దోషం ప్రభావం
రాహుకేతువులు లగ్నంలో గానీ, 7వ స్థానంలో గానీ, 2వ స్థానంలో గానీ, 8వ స్థానంలో గానీ ఉంటే కాలసర్పదోషం తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా అడ్డుకుంటుంది. ఈ కాల సర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తి 42 సంవత్సరాల వయస్సు వరకు వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో సకాలంలో చర్యలు తీసుకోవడం. ఈ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడం లేదా నివారించుకోవడం ముఖ్యం.
జాతకంలో కాలసర్ప దోషాన్ని ఎలా గుర్తించాలంటే
ఎవరి కలలోనైనా పదే పదే పాములు కనిపించినా.. లేదా తమ చుట్టూ పాము ఉన్నట్లు అనిపించినా వారి జాతకంలో కాల సర్ప దోషం ఉందని సూచన. అంతేకాదు ఎవరి కలలోనైనా జంట పాములు తమ చేతిని లేదా కాలును చుట్టుకొని ఉనట్లు కనిపిస్తే అది కాల సర్ప దోషాన్ని కూడా సూచిస్తుంది.
కలలో పాములు నీటిలో ఈదుతున్నట్లు లేదా గాలిలో ఎగురుతున్నట్లు చూడటం కూడా కాల సర్ప దోషానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి కలలో లెక్కలేనన్ని పాములను చూసినా అది తీవ్రమైన కాల సర్ప దోషాన్ని సూచిస్తుంది. ఇటువంటి కలలు వచ్చిన వ్యక్తీ వెంటనే నివారణ చర్యలు పాటించాలి. శివుడిని లేదా సుభ్రమణ్య స్వామిని పూజించాలి.
కాల సర్ప దోషం నుంచి ఉపశమనం ఇచ్చే పరిహారాలు
కాల సర్ప దోషం నుంచి ఉపశమనం పొందడానికి శివుడిని లేదా సుభ్రమణ్య స్వామి లేదా శ్రీ మహా విష్ణువును ధ్యానించి ప్రతిరోజూ పూజించండి. వెండి లేదా గోమేధికంతో చేసిన పాము ఆకారపు ఉంగరాన్ని ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజున గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని 1100 సార్లు జపించడం వలన కాల సర్ప దోషం తొలగుతుంది. అంతేకాదు రాహు, కేతువుల బీజ మంత్రాలైన ఓం రా రాహవే నమః, ఓం స్రాన్ శ్రీన్ శ్రౌన్ : కేత్వే నమః అనే మంత్రాలను పఠించడం ద్వారా జీవితంలోని కాల సర్పదోషాలు తొలగిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు