Mahavatar babaji: నేడు మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం.. ఆయనొక దివ్యావతారం..

|

Jul 25, 2022 | 9:59 AM

Mahavatar babaji: ఒక అవతార పురుషుడు సర్వవ్యాపకుడైన పరమాత్మలో జీవిస్తాడని చెప్పబడింది. ఆయన దేశకాలమానానికి అతీతులు..

Mahavatar babaji: నేడు మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం.. ఆయనొక దివ్యావతారం..
Mahavatar Babaji
Follow us on

Mahavatar babaji: ఒక అవతార పురుషుడు సర్వవ్యాపకుడైన పరమాత్మలో జీవిస్తాడని చెప్పబడింది. ఆయన దేశకాలమానానికి అతీతులు; ఆయనకు భూత, వర్తమాన, భవిష్యత్తులనే సాపేక్షతలు లేవు. ఆయన సజీవ సన్నిధి మూర్తీభవించిన భగవంతుని అమర స్వరూపమే; అది మానవ అవగాహనకు అతీతమైనది. అమరయోగులైన మహావతార్ బాబాజీ తెరచాటున ఉండి మానవాళిని ఉద్ధరించే రక్షకులు; శతాబ్దాల తరబడి ఆయన వినయపూర్వకంగా అజ్ఞాతంగా పని చేస్తున్నారు.

పరమహంస యోగానంద ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కళాఖండమైన ఒక యోగి ఆత్మకథ లో ఆయన గురించి వ్రాసిన కథనం ద్వారా ప్రధానంగా ప్రపంచానికి తెలిసిన మహావతార్ బాబాజీ ఈ రోజు ప్రపంచంలో ఉన్న క్రియాయోగులందరికీ పరమగురువులు; దయతో ఆయన వారి ఆధ్యాత్మిక సాధనలకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అంథయుగాలలో మరుగున పడిపోయిన సనాతన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని తిరిగి కనిపెట్టి స్పష్టంగా తెలియజేసింది బాబాజీయే.

ఆధునిక యుగంలో క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించడం..
క్రియాయోగం ప్రయాణం రాణీఖేత్ (ఉత్తరాఖండ్) దగ్గర ఉన్న ఒక హిమాలయ గుహలో 1861 లో నూటయాభై సంవత్సరాల కన్నా ముందే మొదలయింది; అక్కడే బాబాజీ లాహిరీ మహాశయులకు ఈ పవిత్రమైన శాస్త్రాన్ని ప్రదానం చేశారు. ఆ సందర్భంలో బాబాజీ ఇలా అన్నారు, “ఈ పంధొమ్మిదో శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం, కొన్నివేల ఏళ్ళ కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన, ఉత్తరోత్తరా పతంజలికీ క్రీస్తుకూ సెయింట్ జాన్ కూ సెయింట్ పాల్ కూ తదితర శిష్యులకూ తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే.”

తనను ‘వినయపూర్వకంగా అడిగిన సత్యాన్వేషకులందరికీ’ క్రియాయోగాన్ని ప్రదానం చేయడానికి బాబాజీ లాహిరీ మహాశయులను అనుమతించారు. అత్యున్నత ప్రాణాయామ ప్రక్రియగా పరిగణించబడిన క్రియాయోగం, ఒక మనోభౌతిక పద్ధతి; అది కాలక్రమేణా సాధకుడికి తన శ్వాసపై, ఆంతరిక ప్రాణశక్తులపై, మనస్సుపై పట్టును ప్రసాదించి, తద్ద్వారా ఆ సూక్ష్మశక్తులకు ఉన్నతమైన, ఆధ్యాత్మికంగా ముక్తిని ప్రసాదించే కార్యాచరణను ఇచ్చే ఒక సమగ్ర శాస్త్రం కూడా. క్రియాయోగం యొక్క క్రమబద్ధమైన సమర్థత, అహంబాధిత ఉనికి నుంచి విశ్వ చైతన్యానికి చేసే ప్రయాణాన్ని శ్రీఘ్రతరం చేస్తుంది.

క్రియాయోగ బోధనలను వ్యాపింపజేయడానికి, సత్యాన్వేషకులు భగవంతుడితో వ్యక్తిగతమైన సంసర్గము ఏర్పరచుకోవడంలో తోడ్పడడానికి తన గురువైన యుక్తేశ్వర్ (లాహిరీ మహాశయుల శిష్యులు) ఆదేశంపై యోగానంద 1917 లో భారతదేశంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను, 1920 లో అమెరికాలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు.

ఆ యువ సన్యాసి అమెరికాలో నిర్వహించబోయే బృహత్కార్యాన్ని ఆశీర్వదించడానికి యోగానందను వారి తండ్రి గృహంలో 1920 లో మహావతార్ బాబాజీ సందర్శించిన శుభసందర్భానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 25 వ తేదీ మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవంగా వై.ఎస్.ఎస్. జరుపుకుంటోంది. క్రియాయోగ సందేశాన్ని పాశ్చాత్యంలో వ్యాప్తి చేయడానికి తాను ఎంపిక చేసిన వ్యక్తి ఆయనేనని బాబాజీ ఆయనకి భరోసా ఇచ్చి ఆశీర్వదించారు.

జగత్తు కోసం ఒక దివ్య ప్రణాళిక ఉంది..
బాబాజీ ఆధునిక భారతదేశంలో క్రీస్తు వంటి యోగిపుంగవులని యోగానంద పేర్కొన్నారు. బాబాజీ, క్రీస్తు ఒకరితో ఒకరు సంసర్గంలో ఉంటూ, ముక్తిదాయక స్పందనలను పంపుతూ, ఈ యుగంలో ఆధ్యాత్మిక పరమైన మోక్షం పొందడానికి ప్రణాళికలు వేస్తూ, యుద్ధాలను, జాతి ద్వేషాన్ని, మతపరమైన శాఖావాదాన్ని, భౌతికవాదం వల్ల కలిగే విపత్తులను విడిచిపెట్టమని దేశాలను ప్రేరేపిస్తున్నారని ఆయన నొక్కి చెప్పారు. యోగం యొక్క ఆత్మకి ముక్తినిచ్చే సామర్థ్యాన్ని ప్రాచ్యపాశ్చాత్య దేశాలలో సమానంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని బాబాజీ గ్రహించారు.

బాబాజీ సుదూరంగా ఉన్న హిమాలయ ప్రాంతాల్లో ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తమ ఉన్నతమైన శిష్యబృందంతో ప్రయాణిస్తూ ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే దర్శనమిచ్చే వారని ఒక యోగి ఆత్మకథ పేర్కొంటోంది. లాహిరి మహాశయులు ఇలా ప్రకటించారు: “ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది.” ఈ వాస్తవాన్ని ఈ దివ్యావతారుని శ్రద్ధాళువులైన భక్తులందరూ ప్రమాణపూర్వకంగా చెప్పారు. చిత్తశుద్ధి గల క్రియాయోగులందరినీ వారి లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో కాపాడతానని, మార్గదర్శనం చేస్తానని మహావతార్ బాబాజీ వాస్తవంగా వాగ్దానం చేశారు. మరింత సమాచారం కోసం: yssofindia.org సంప్రదించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..