
మహాశివరాత్రి అంటే.. శివుడి శక్తిని అనుభవించే రాత్రి. ధ్యానం, సంగీతం, నృత్యం, ఆధ్యాత్మిక స్పర్శ… అన్నీ ఒక్కే వేదికపై కలిసే అపూర్వ సందర్భం. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో ఈ రోజు రాత్రి జరగనున్న మహాశివరాత్రి వేడుకలను ఈసారి మరింత ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎదురుచూస్తున్న ఈ వేడుకలు, తొలిసారి చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికీ పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా సైన్ లాంగ్వేజ్‌తో లైవ్‌స్ట్రీమ్ చేయనున్నట్లు ఇషా సంస్థ ప్రకటించింది.
ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ లైవ్ ప్రసారం.. ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అంటే, శివరాత్రి రాత్రంతా ఒకే ప్రవాహంలా సాగుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఒకే వేదికపై కలిపేలా ఇషా ఏర్పాట్లు చేసింది.
ఈ ఏడాది లైవ్‌స్ట్రీమ్‌ను 23 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, కన్నడ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భారతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు. అలాగే నేపాలీ, రష్యన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, మాండరిన్, ఇటాలియన్, రొమేనియన్, అరబిక్, ఇండోనేషియన్, వియత్నామీస్ వంటి విదేశీ భాషల్లోనూ లైవ్ శాటిలైట్ ఫీడ్స్ ద్వారా ప్రసారం అందుబాటులో ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరు చూసినా.. భాష అడ్డంకి లేకుండా మహాశివరాత్రిని అనుభవించేలా ఈసారి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
ఇషా మహా శివరాత్రి వేడుకలు లైవ్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి…
ఇషా మహాశివరాత్రి వేడుకలకు ఈసారి ముఖ్య అతిథిగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. కేంద్ర సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మిక నేతలు, కళాకారులు ఈ మహా వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మహాశివరాత్రి వేడుకలను గంగా థీమ్‌తో నిర్వహిస్తున్నారు. గంగానది ఆధ్యాత్మికత, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ఒకే దారంలో చూపించేలా కార్యక్రమాలను రూపొందించారు. సద్గురు మార్గనిర్దేశంలో శక్తివంతమైన ధ్యానాలు, ఆధ్యాత్మిక సాధనలు జరగనుండగా.. మరోవైపు సంగీత–నృత్య ప్రదర్శనలతో వేదిక కళకళలాడనుంది.
ఈసారి వేదికపై దేశంలోని ప్రముఖ కళాకారుల సందడి ఉండనుంది. ఆదిత్య గాధ్వి, ప్రశాంత్ సోనగ్రా వంటి పేరున్న కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. Sounds of Ishaతో కలిసి స్వరూప్ ఖాన్, బ్లేజ్, హరీష్ సాగానే, ఢోల్ తాషా వంటి వారు తమ ప్రత్యేక ప్రదర్శనలతో అలరించనున్నారు. అలాగే స్వాగత్ రాథోడ్, పృథ్వీ గంధర్వ్, ఐశ్వర్య నిగమ్, దీపాలి సహాయ్ కూడా Sounds of Ishaతో కలిసి సంగీత సమర్పణ చేయనున్నారు.
ఈ ఏడాది మరో ప్రత్యేక ఆకర్షణగా.. తొలిసారి సద్గురు ‘యోగేశ్వర లింగ మహా అభిషేకం’ నిర్వహించనున్నారు. భక్తులు యోగేశ్వర లింగతో మరింత లోతైన అనుసంధానం పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఇషా వర్గాలు తెలిపాయి. ఈ ఉచిత ఆఫరింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు సమాచారం.
‘యోగేశ్వర లింగ మహా అభిషేకం’ ఉచితంగా రిజస్టర్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
ఇషా మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏడాది 170కి పైగా దేశాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సంగీతం, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలతో శివుడి శక్తిని అనుభవించేలా ఈ వేడుకలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాగమాల్లో ఒకటిగా మారాయి. ఈసారి సైన్ లాంగ్వేజ్‌తో చెవిటి, వినికిడి లోపం ఉన్నవారికీ ఈ అనుభూతిని చేరువ చేయడం.. ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని నిర్వాహకులు పేర్కొన్నారు.