
Broken mangalsutra dream meaning: మనం నిద్రిస్తున్న సమయంలో చాలా సార్లు కలలు వస్తుంటాయి. కొన్ని కలలు ప్రత్యేక సంకేతాలిస్తుంటాయని కలల శాస్త్రం చెబుతుంది. కలల శాస్త్రం లేదా స్వప్న శాస్త్రం అనేది కలల అర్థాన్ని వివరించే ఒక పురాతన భారతీయ శాస్త్రం. కలలు అనేది ఒక వ్యక్తి భవిష్యత్తులో సంభవించే శుభ, అశుభ సంఘటనలకు సంకేతాలు అని నమ్ముతారు. ఈ శాస్త్రం ప్రకారం.. కలలో కనిపించే ప్రతి వస్తువుకుప్రత్యేక అర్థం ఉంటుంది. దీని ప్రకారం కలలో మంగళ సూత్రం (తాళి) చూడటం చాలా శుభ సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతారు. మంగళ సూత్రాన్ని కలలో చూడటం భర్త దీర్ఘాయువు, కుటుంబంలో శాంతి, వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తుందని నమ్ముతారు. మంగళ సూత్రం వివాహిత స్త్రీ జీవితంలో స్వచ్ఛత, శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి, దానిని కలలో చూడటం మంచి ఫలితాలను ఇస్తుందని కలల శాస్త్రం వివరిస్తుంది.
మంగళసూత్రం కలలో విరిగిపోయినట్లు కనిపిస్తే, దానిని అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు కలలో తమ తాళి తెగిపోయినట్లు కనిపిస్తే.. అది వారి భర్త జీవితంలో జరుగుతున్న సమస్యలకు సంకేతం కావచ్చని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి కల భర్త ఆరోగ్యం, ఉద్యోగం లేదా మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను సూచిస్తుందని చెబుతారు.
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటువంటి అశుభ కలలు వచ్చే స్త్రీలు భయపడకూడదు. ప్రశాంతంగా శివుడిని పూజించాలి. భర్త దీర్ఘాయువు, కష్టాల తొలగింపునకు సంబంధించిన పూజలు, ఉపవాసాలు, ప్రార్థనలు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు.
అంతేగాక, మనస్సులో ధైర్యం, సానుకూలతను కాపాడుకోవడం, దేవుని అనుగ్రహాన్ని కోరుకోవడం మంచిదని పండితులు సలహా ఇస్తున్నారు. అందుకే ఇలాంటి కలలు వచ్చినప్పుడు దేవుళ్లను ధ్యానించడం, పూజించడం ముఖ్యమని చెబుతున్నారు. దైవారాధనతో పరిస్థితి సానుకూలంగా మారుతుందని చెబుతున్నారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)