Bodh Gaya: బుద్ధ గయలోని మహాబోధి ఆలయం గురించి మీకు తెలియని ఆసక్తికర అంశాలు..

|

Oct 06, 2021 | 10:59 AM

Mahabodhi Temple in Bodh Gaya: టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే.

Bodh Gaya: బుద్ధ గయలోని మహాబోధి ఆలయం గురించి మీకు తెలియని ఆసక్తికర అంశాలు..
Mahabodhi Temple In Bodh Gaya Interesting Facts
Follow us on

Mahabodhi Temple in Bodh Gaya: టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే. అందులో సిద్ధార్థుడికి జ్ఞానోదయం కల్గించి గౌతమ బుద్ధుడిగా మార్చిన ప్రదేశం బుద్ధ గయ వారికి పరమ పవిత్ర స్థలాల్లో ఒకటి. కరోనా కంటే ముందు దేశ, విదేశీ యాత్రికులు, భక్తులతో కిటకిటలాడిన బుద్ధ గయలోని మహాబోధి ఆలయంలో… మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం విదేశీ యాత్రికులు పెద్దగా కనిపించకపోయినా, దేశీయ యాత్రికుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోంది.

ఈ ప్రదేశం గౌతమ బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన స్థలంగా భావించి పూజిస్తారు. పడమరవైపు, పవిత్ర బోధి వృక్షం ఉంది. ఇది ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంది. మహాబోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి క్రీస్తూ పూర్వం 3వ శతాబ్దంలో నిర్మించగా.. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. అశోకుడి కాలంలో వజ్రాసనను నిర్మించి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కింద స్థాపించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ అశోకుడి కాలం నాటి శాసనాలు కూడా తవ్వకాల్లో బయటపడి కనిపిస్తాయి. ఆనాటి నుంచి ఇప్పటికీ దాని అసలు రూపం లో నిలబడి, పూర్తిగా ఇటుకలతో నిర్మించిన ప్రాధమిక బౌద్ధ దేవాలయాలలో ఒకటిగా మహాబోధి ఆలయం నిలిచిందని చెబుతుంటారు. ప్రధాన గోపురాన్ని 19వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు. ప్రధాన గోపురం చుట్టూ, అదే శైలిలో నాలుగు చిన్న గోపురాలు కూడా ఉన్నాయి. ఈ మహాబోధి ఆలయ నాలుగు సరిహద్దులు రెండు మీటర్ల ఎత్తులో దగ్గరగా రాతి రైలింగుతో ఉన్నాయి. వీటిపై సూర్యుడు, లక్ష్మి, ఇంకా అనేక భారతీయ దేవీ దేవతల విగ్రహాలతో ఉంటే, కొన్ని రైలింగ్ లు తామరపూలతో కనిపిస్తాయి.

మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ-బౌద్ధ మతాలకు చెందిన భిక్షువులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక భక్తుల విషయానికొస్తే.. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు అనేక ఇతర మతాలకు చెందిన యాత్రికులు ఈ విశిష్ట చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.

ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కించుకున్న వేల ఏళ్ల నాటి మహాబోధి ఆలయాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, అయితే ఇక్కడ కనెక్టివిటీ సమస్య ఉందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. గయలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసి, సర్వీసులు ప్రారంభించినప్పటికీ, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదరవుతున్నాయి. రైలు మార్గం ఉన్నప్పటికీ, గోల్డెన్ ట్రయాంగిల్ మాదిరిగా టూరిస్ట్ సర్క్యూట్లుగా రోడ్డు, రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపర్చాలని టూర్ ఆపరేటర్ల సంఘం కోరుతోంది. అలాగే విదేశీ యాత్రికుల కోసం ప్రకటించిన 5 లక్షల ఉచిత టూరిస్ట్ వీసాల విధానాన్ని మరో ఏడాది పొడిగించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతోంది.

కేంద్ర ప్రభుత్వం దేఖో అప్నా దేశ్ అనే నినాదంతో దేశంలోని చారిత్రక ప్రాముఖ్యత కల్గిన ప్రదేశాలను చూసేందుకు స్వదేశీ యాత్రికులను ప్రోత్సహిస్తోంది. స్వదేశ్ దర్శన్ కార్యక్రమాన్ని చేపట్టి ఆయా ప్రదేశాల అభివృద్ధికి నిధులిస్తోంది. ఆ క్రమంలో బోధ్ గయ అభివృద్ధికి కూడా నిధులిచ్చినట్టు పేర్కొంది. కేవలం నిధులతోనే సరిపెట్టకుండా, రాష్ట్రాల పర్యాటక శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని ఇతర విభాగాలతో కలిపి సంయుక్త కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పర్యాటక రంగం ఒక్కటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి సృష్టించగల్గుతుందని కేంద్రం వెల్లడిస్తోంది. ఈ క్రమంలో ఈ రంగంలో ఉండేవారికి నైపుణ్య శిక్షణ కూడా కల్పిస్తున్నామని, తద్వారా పర్యాటకం మరింత వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని వెల్లడిస్తోంది.

(మహాత్మ కొడియార్, ఢిల్లీ బ్యూరో, టీవీ9 తెలుగు)

 

Also Read..

LPG Gas Price: గ్యాస్ వినియోగదారలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. దసరా ముందు ఇదేం బాదుడు..

Raashi Khanna: ఆ ముగ్గురు హీరోలంటే చాలా ఇష్టం.. మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..