
శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడు తన భక్తులపాలిట కల్పతరువు. ధైర్యశాలి, దుష్టశక్తులను తరిమికొట్టే బలశాలి అయిన ఆంజనేయ స్వామి.. తన భక్తులు కోరినవెంటనే అనుగ్రహించే దైవం. అందుకే, పిల్లల నుంచి పెద్దల వరకు హనుమంతుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. ప్రతిరోజు హనుమంతుడి దర్శనాన్ని పొందిన తర్వాతే చాలా మంది తమ పనులు ప్రారంభిస్తుంటారు.
హనుమంతుడు సాధారణంగా ఆలయాల్లో ఒక్కడే దర్శనమివ్వడం ప్రత్యేకత. శివుడు, విష్ణువులు ఇతర దేవతలతో సతీ సమేతంగా దర్శనమివ్వగా.. హనుమంతుడు ఒక్కడే ఉంటాడు. అందువల్ల ఆయనను ‘ఆజన్మ బ్రహ్మచారి’గా పరిగణిస్తారు. కానీ, కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని చెబుతాయి.
బ్రహ్మచారిగానే హనుమంతుడు
అందుకే, హనుమంతుడు సతీ సమేతంగా దర్శనమివ్వడం కొన్ని ప్రత్యేక ఆలయాల్లో మాత్రమే కనిపిస్తుంది. హనుమంతుడు సాయుధ శక్తివంతుడైనప్పటికీ.. ఆయనకు గురువుగా సూర్యభగవాన్ ఉన్నారు. ఈ సందర్భంలో, హనుమంతుడు ఆకాశంలో తిరుగుతూ సూర్యుని వద్ద వేదాలను, తొమ్మిదురకాల వ్యాకరణాలను నేర్చుకుంటాడు. తొమ్మిదో వ్యాకరణం నేర్చుకోవడానికి వివాహితుడై ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది, కానీ హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకుంటాడు.
త్రిమూర్తుల ఆలోచన మేరకు సూర్యుడు తన కిరణాల నుంచి సువర్చల అనే అమ్మాయిని సృష్టించి, హనుమంతుడికి వివాహం చేయించడం జరిగింది. ఈ సువర్చలకు భౌతిక రూపం లేదు, కేవలం తేజస్సు రూపంలో ఉంటుంది. అందుకే హనుమంతుడు ఎప్పటికీ బ్రహ్మచారి స్వభావం కొనసాగించాడు. సువర్చలతో వివాహం తర్వాత హనుమంతుడు తన వ్యాకరణం పూర్తిచేసి తపస్సుకు వెళ్ళాడు.
హనుమంతుడు సతీ సహితంగా దర్శనమివ్వడం కారణంగా, కొన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామి కళ్యాణం నిర్వహించబడుతుంది. తెలంగాణలో ఒకే ఒక ఆలయం ఇలా ఉంది. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం 2006లో నిర్మించబడింది.
ఇక్కడ తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు దర్శనానికి వస్తారు. అలాగే, భార్యాభర్తల మధ్య సమస్యలు, తగాదాలు ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని దర్శించటం ద్వారా సమస్యల పరిష్కారం జరిగిందని కొందరు భక్తులు నమ్ముతారు.