Hanuman Jayanti: హనుమాన్ జన్మోత్సవ్ మంగళవారమే..! ఈ రోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!
Hanuman Jayanti 2026: హనుమజ్జయంతి తేదీపై ప్రతి ఏడాది భక్తుల్లో భిన్నాభిప్రాయాలు కనిపిస్తాయి. కొందరు చైత్ర మాసంలో శ్రీరామ నవమి తర్వాత వచ్చే రోజునే హనుమజ్జయంతిగా భావిస్తే, తెలుగు సంప్రదాయం ప్రకారం మాత్రం వైశాఖ బహుళ దశమినే అసలైన హనుమజ్జయంతిగా ఆచరిస్తారు. పరాశర సంహిత ప్రకారం పూర్వాభాద్ర నక్షత్ర యోగంలో ఈ వేడుకను జరుపుకోవడం విశేషంగా భావిస్తారు.

Hanuman Janmotsav: హనుమజ్జయంతి తేదీపై ప్రతి ఏడాది భక్తుల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. కొందరు చైత్ర మాసంలో శ్రీరామ నవమి తర్వాత వచ్చే రోజునే హనుమజ్జయంతిగా భావిస్తే.. మరికొందరు వైశాఖ బహుళ దశమినే అసలైన హనుమజ్జయంతిగా ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో పండితులు, పంచాంగకర్తలు చెప్పే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం హనుమంతుడి జన్మదినాన్ని వైశాఖ బహుళ దశమి రోజున, ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్ర యోగం కలిసినప్పుడు జరుపుకోవాలని పరాశర సంహితలో పేర్కొనబడింది.
ఆంజనేయ మంగళాష్టకంలో కూడా దీనికి ఆధారంగా భావించే శ్లోకం ఉంది:
- “వైశాఖే మాసి కృష్ణాయాం
- దశమ్యం మందవాసరే
- పూర్వాభాద్ర ప్రభూతాయ
- ఆంజనేయాయ మంగళమ్”
ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాసంలోని బహుళ దశమి తిథి, పూర్వాభాద్ర నక్షత్ర సమయాన ఆంజనేయుడు అవతరించినట్లు విశ్వసిస్తారు.
ఈ ఏడాది తేదీపై స్పష్టత
ఈసారి దశమి తిథి మే 11 ఉదయం ప్రారంభమై మే 12 ఉదయం వరకు కొనసాగుతోంది. అయితే పూర్వాభాద్ర నక్షత్రం మే 12న సూర్యోదయ సమయంలో ఉండటం వల్ల, చాలామంది పండితులు, పంచాంగకర్తలు మే 12నే హనుమజ్జయంతి(హనుమాన్ జన్మోత్సవ్)గా సూచిస్తున్నారు. అందువల్ల తిథి–నక్షత్ర సమన్వయం ఆధారంగా ఆ రోజు పూజలు నిర్వహించడం శ్రేయస్కరమని చెబుతున్నారు.
హనుమత్ విజయోత్సవం అంటే ఏమిటి?
చైత్ర మాసంలో శ్రీరామ నవమి అనంతరం నిర్వహించే శోభాయాత్రలు, ప్రత్యేక ఉత్సవాలను కొన్ని ప్రాంతాల్లో “హనుమత్ విజయోత్సవం”గా పిలుస్తారు. ఇది హనుమంతుడి వీరత్వం, రామభక్తిని స్మరించుకునే ఉత్సవం. అయితే దాన్ని హనుమజ్జయంతితో సమానంగా చూడకూడదని కొందరు ఆధ్యాత్మిక పండితులు అభిప్రాయపడుతున్నారు.
హనుమజ్జయంతి పూజ విధానం
హనుమజ్జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆంజనేయస్వామిని భక్తితో పూజించడం ఆనవాయితీ. సింధూరంతో అలంకరించి, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. హనుమాన్ అష్టోత్తరం, హనుమాన్ చాలీసా, సుందరకాండ లేదా ఆంజనేయ దండకం పారాయణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేగాక, అఖండ ఐశ్వర్యం లభిస్తుందని విశ్వసిస్తారు.
నైవేద్యంగా వడపప్పు, పానకం, గారెలు, బెల్లం అప్పాలు సమర్పిస్తారు. ఆలయ దర్శనం చేసి తమలపాకులతో ఆకు పూజ చేయించడం, వడమాల సమర్పించడం కూడా విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
పాటించాల్సిన నియమాలు
- ఉపవాసం లేదా నియమాచరణ పాటించడం
- బ్రహ్మచర్యం ఆచరించడం
- రాత్రివేళ భూశయనం చేయడం
- పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం
- ఇలాంటి ఆచారాలు హనుమంతుని కృపను పొందేందుకు ఉపకరిస్తాయని భక్తులు నమ్ముతారు.
ప్రాంతానుసారం జయంతి తేదీలు
- హనుమజ్జయంతి వేడుకలు ప్రాంతానుసారం మారుతూ ఉంటాయి.
- తెలుగు రాష్ట్రాల్లో — వైశాఖ బహుళ దశమి
- ఉత్తర భారతదేశంలో — చైత్ర పౌర్ణమి
- కేరళలో — మార్గశిర మాసం
తేదీలు, సంప్రదాయాలు భిన్నంగా ఉన్నా, ఆరాధ్యదైవం మాత్రం ఒక్కరే.. భక్తి, శక్తి, సేవకు ప్రతీక అయిన ఆంజనేయస్వామి. అయితే, హనుమంతుడిని స్మరించే ప్రతి రోజూ భక్తులకు పండుగే అని భావిస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
