శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు TSRTC లాజిస్టిక్స్ సెంటర్లలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. రామయ్య కల్యాణం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు TSRTC హోం డెలివరీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను TSRTC వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన స్టార్ట్ చేశారు.
భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా శ్రీరాముని కల్యాణంలో ఉపయోగిస్తున్నారు.విశిష్టమైన ఈ తలంబ్రాలను వ్యయప్రయాసలు లేకుండా భక్తుల ఇంటికి చేర్చేందుకు రెండేళ్ల క్రితమే TSRTC యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది.” అని TSRTC ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు TSRTC కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..