Kashi Ganga Jal: కాశీ నుంచి తెచ్చిన నీటిని ఇంట్లో ఉంచుకోవచ్చా..?

కాశీ నుంచి గంగాజలం ఇంటికి తెచ్చుకోకూడదని పెద్దలు చెబుతారు. కాశీ మహాస్మశానం కావడమే దీనికి కారణం. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం నుంచి, లేదా హరిద్వార్ వంటి గంగ ప్రవాహానికి ఎగువ ప్రాంతాల నుండి పవిత్ర గంగాజలం సేకరించడం శ్రేయస్కరం.

Kashi Ganga Jal: కాశీ నుంచి తెచ్చిన నీటిని ఇంట్లో ఉంచుకోవచ్చా..?
Kashi Ganga Jal

Updated on: Mar 11, 2026 | 8:23 AM

చాలామంది భక్తులు పవిత్ర కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు, అక్కడి కేదార్ ఘాట్ లేదా మణికర్ణిక ఘాట్ వంటి ప్రాంతాల నుండి గంగాజలాన్ని సేకరించి ఇంటికి తెచ్చుకోవడం పరిపాటిగా చెబుతుంటారు. అయితే, సంప్రదాయం తెలిసిన పెద్దలు ఈ విషయంలో ఒక ముఖ్యమైన సూచన చేస్తారు. వాస్తవానికి, కాశీ నుంచి తెచ్చిన గంగాజలాన్ని ఇంటిలో పెట్టుకోకూడదని వారు స్పష్టం చేస్తారు. దీనికి ప్రధాన కారణం కాశీని “మహాస్మశానం”గా పరిగణించడం. అంటే, పుట్టుక ఎంత సత్యమో, మరణం కూడా అంతే సత్యం. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి ప్రాణి ఏ మట్టి నుంచి వచ్చిందో ఆ మట్టిలో కలిసిపోతుందనే శాశ్వత సత్యాన్ని కాశీ తెలియజేస్తుంది. ప్రళయ కాలంలో కూడా వెలిగేది, ప్రకాశించేది కాబట్టి దీనికి కాశీ అని పేరు వచ్చింది. అటువంటి పవిత్రమైన, కానీ అంతిమ సత్యాన్ని గుర్తుచేసే ప్రదేశం నుంచి నీటిని తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదని సంప్రదాయవేత్తలు నొక్కిచెబుతారు.

మరి గంగాజలం ఎక్కడ నుంచి సేకరించాలి అనే ప్రశ్నకు, ప్రయాగ సరైన సమాధానం. పూర్వ కాలంలో యాత్రలు చేయడం అనేది ఎంతో జాగ్రత్తగా, కఠినమైన పద్ధతిలో జరిగేది. కాశీకి వెళ్ళినవారు ప్రయాగను కూడా సందర్శించకుండా ఉండేవారు కాదు, ఎందుకంటే ప్రయాగ కాశీ యాత్రలో అంతర్భాగం. ప్రయాగ వద్ద ఉన్నటువంటి గంగా నీటిని సేకరించడం శుభప్రదం. ప్రయాగలో గంగా, యమున నదుల సంగమం జరుగుతుంది. ఇక్కడ ఒకవైపు ముదురు ఆకుపచ్చ రంగులో యమున నది ప్రవహిస్తుండగా, మరోవైపు తెల్లని గంగా నది ప్రవహిస్తుంది. ఈ రెండూ కలిసే ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. గంగా, యమున నదులు కలిసే చోట, గంగా నది యొక్క స్వచ్ఛమైన నీరు స్పష్టంగా ఒక గీత గీసినట్లుగా కనిపిస్తుంది. మామూలుగా నదుల నీరు కలుస్తుంది అనుకుంటాం కానీ, ఇక్కడ రెండు వేర్వేరు రంగులలో ఉన్న నీరు తేడాను చూపుతూనే కలుస్తుంది. ఇటువంటి చోట గంగా నీటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే, ఉత్తరాన్నుండి దక్షిణానికి ప్రవహిస్తున్న గంగా నది ప్రయాగ నుండి దారి మళ్ళి, ఉత్తరవాహినిగా అంటే ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ కాశీకి వెళుతుంది. కనుక, మహాస్మశానమైన కాశీకి వెళ్ళకముందు ఉన్న గంగా నీటిని ప్రయాగ నుంచి సేకరించడం ఎంతో శ్రేయస్కరం అని పెద్దలు చెబుతారు. అందుకే కాశీకి వెళ్ళినప్పుడు, పాత్రలలో జాగ్రత్తగా భద్రపరచి, సీలు వేసిన గంగాజలం సీసాలు అమ్ముతుంటారు. వాస్తవానికి వాటిలో ప్రయాగ నుండి సేవరించిన గంగాజలాన్ని నింపి అందిస్తారు. కనుక, గంగాజలం సేకరించాలనుకుంటే హరిద్వార్ నుంచి గానీ, లేదా గంగ ప్రవాహానికి ఎగువన ఉన్న ఏ ఇతర పవిత్ర ప్రదేశం నుండి గానీ తెచ్చుకోవచ్చు, కానీ కాశీ నుంచి మాత్రం కాదని సంప్రదాయం తెలిసిన పెద్దల మాట.

(ఈ సమాచారం పండితుల నుంచి సేకరించబడింది)

 

Follow Us