Chanakya Niti: స్నేహితుల ద్వారా విజయం సాధించడమెలా..? మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎలా..?
ఆచార్య చాణక్యుడు ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధ విద్వాంసుడు, గొప్ప రాజకీయవేత్త, అత్యుత్తమ ఆర్థిక నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాడు. చాణక్యుని సూత్రాలు, ఆలోచనల ఆధారంగా రూపొందించిన గ్రంథమే చాణక్య నీతి. ఆయన ఆలోచనలు, సూత్రాలను అనుసరించి జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. ఈ ఆధునిక యుగంలోనూ చాణక్యుని ఆలోచనలకు ఉన్న విలువ, గౌరవం పెరుగుతూనే ఉంది.

చాణక్య నీతిలో జీవితానికి అవసరమైన వివిధ విషయాల గురించి స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. ఒక వ్యక్తి జీవితంలో అన్ని దశల్లోనూ వివిధ రకాల వ్యక్తులను కలుసుకోవాల్సి ఉంటుంది. స్నేహితులను ఎంచుకోవడంలో ఉన్న రహస్యం గురించి చాణక్య నీతిలో ఇచ్చిన సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్నేహితులను ఎలా ఎంచుకోవాలి..?
చాణక్య నీతి మనుషుల స్వభావాలను ఖచ్చితంగా అంచనా వేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. చాణక్యుని అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి స్నేహితులను ఎంచుకోవడం వారి జీవిత మార్గాన్ని ఎంచుకోవడంతో సమానం.
మంచి స్వభావం గల స్నేహితుల వల్ల మన జీవితం విజయం వైపు సాగుతుంది. చెడు స్వభావాలు గల స్నేహితులు పాము వంటివారు. వారి నుండి ఎల్లప్పుడూ మనకు ప్రమాదం మాత్రమే వస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు.
చాణక్య నీతి ప్రకారం, వ్యసనాలకు బానిసైన వారు తమ భార్య పిల్లలను పట్టించుకోకుండా స్వార్థంతో జీవించేవారు పాము లాంటివారు. వారితో స్నేహం చేయడం మీకు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.
ఇంకా జీవితంలో నీతి, నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వని వారితో స్నేహం చేయడం వల్ల మీ జీవితం కూడా తప్పు దారిలో వెళుతుంది. ఇటువంటి స్నేహాన్ని ప్రారంభంలోనే వదిలించుకోవాలని చాణక్యుడు పేర్కొన్నాడు.
పాముల వలె కొంతమంది వ్యక్తులు ఎల్లప్పుడూ తమ చర్యలలో విషపూరితమైనవి కలిగి ఉంటారు. వారిని గుర్తించినట్లయితే వారి నుండి దూరంగా ఉండటం అవసరం.
తమను పెంచిన తల్లిదండ్రులకు సహాయం చేయనివారు, వారిని అవమానించేవారు చాలా చెడ్డ వ్యక్తులని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇటువంటి స్వభావం గలవారు ఎవరి జీవితాన్ని కూడా సరైన మార్గంలో వెళ్ళనివ్వరు.
