
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభించారు. కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్నయాదాద్రి అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు యాదాద్రి పనుల పురోగతిపై త్వరలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
దేశంలో ఉన్న అత్యద్భుత ఆలయాల్లో యాదాద్రి ఒకటిగా నిలిచేలా సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో లోపాలు, తుది పనుల నిర్వహణలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ…సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తుది దశకు చేరుకున్న యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని విభాగాల పనులను ఏక కాలంలో కొనసాగించాలని సూచించారు. అన్ని పనులు సెప్టెంబరు నాటికి పూర్తి కావల్సిందేనని భూపాల్‌రెడ్డి అధికారులకు సూచించారు.
గత ఏడాది డిసెంబర్ 17న సీఎం కేసీఆర్ యాదాద్రి పనులను సందర్శించిన విషయం తెలిసిందే. అనంతరం గుట్టపై జరిగిన ఆలయ విస్తరణ, పుష్కరిణి పునరుద్దరణపై భూపాల్‌రెడ్డి సీఎంకు నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుది దశలో ఉన్న పనులతో పాటు రహదారుల విస్తరణపై సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే యాదగిరి గుట్ట పరిసర ప్రాంతమంతా పచ్చదనం, అందమైన పూల మొక్కలు, వాటర్‌ఫాల్స్ నిర్మాణాలు, పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా అనేక ఏర్పాట్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.