Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara swamy) కొలువైన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి. భక్తులు కోరిక కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. వెంకన్నను దర్శించుకుని జన్మ చరితార్థం అయిందని భావిస్తారు. స్వామివారికి హిందువులు మాత్రమే కాదు..ముస్లింలు కూడా భక్తులే.. వెంకటేశ్వర స్వామిని విశ్వసించి ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారన్న సంగతి తెలిసిందే. కడపలోని వెంకటేశ్వర స్వామిని అయితే తమ ఇంటి అల్లుడిగా భావించే ముస్లింలు ఉన్నారు. పండగలు, పర్వదినాల సమయంలో వెంకన్నని తమ ఇంటికి ఆహ్వానిస్తూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. కానుకలు సమర్పిస్తారన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా తిరుమలలోని శ్రీవారిని చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ ముస్లిం దంపతులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం టీటీడీకి సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి దాతలు విరాళం చెక్కును అందించారు.
తాము ఇచ్చిన విరాళంలో నగదును ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు వినియోగించాలని.. ఇక తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలను ఉపయోగించాలని కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..