
హిందూ మతంలో వారంలోని ప్రతి రోజుకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శనివారం రోజున త్రయోదశి తిథి కలిసివస్తే దాన్ని శనిత్రయోదశిగా భావిస్తామో.. అలాగే బుధవారం రోజున అష్టమి తిథి కలిసివస్తే దానిని బుధాష్టమి అని అంటారు. ఈ సంవత్సరం మార్చి 11 బుధవారం ఫాల్గుణ బహుళ అష్టమి తిథి కలిసి వచ్చినందున ఈ రోజు బుధాష్టమిగా భావిస్తారు. పురాణాల ప్రకారం, ఈ రోజున భక్తితో శివుడు, శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే అపారమైన పుణ్యం లభించి, పూర్వ జన్మ పాపాలు తొలగుతాయని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందువల్ల ఈ రోజున శివుడు.. శ్రీ మహావిష్ణువును యథాశక్తిగా పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
నవగ్రహాలలో బుధగ్రహం తెలివి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలకు కారకుడిగా భావించబడుతుంది. బుధవారం రోజుకు అధిపతి కూడా బుధుడే. కాబట్టి ఈ రోజున.. బుధగ్రహ మంత్రం జపించడం, నవగ్రహ స్తోత్రం చదవడం, శివపార్వతులు, శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిదిగా భావిస్తారు. బుధాష్టమి వ్రతం.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆచరించకపోయినా గుజరాత్, మహారాష్ట్ర వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ వ్రతాన్ని విశేషంగా పాటిస్తారు.
ఈ వ్రతాన్ని ఎనిమిది బుధాష్టముల వరకు ఆచరించాలి. అంటే బుధవారం రోజున అష్టమి తిథి వచ్చినప్పుడే చేయాలి కాబట్టి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎనిమిది సార్లు పూర్తయ్యాక బుధుని రూపం ఉన్న బంగారు లేదా వెండి నాణెన్ని దానం చేయాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న బుధ దోషాలు తొలగి, పాపాలు నశించి కైవల్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజున శివపార్వతులను పూజించడం, శ్రీ మహావిష్ణువును విష్ణు సహస్రనామాలతో అర్చించడం చాలా శుభఫలితాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాభారతం ప్రకారం, శ్రీకృష్ణుని ఆదేశంతో పాండవులు వనవాస సమయంలో బుధాష్టమి వ్రతాన్ని ఆచరించి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని కథనాలు చెబుతున్నాయి. మనమూ బుధాష్టమి రోజున బుధగ్రహం, శివపార్వతులు, శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి వారి అనుగ్రహం పొందుదాం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని సంస్థ ధృవీకరించదు.)