అయోధ్యలో రామాలయంలో జరిగే రామ్ లల్లా పవిత్రోత్సవానికి పూర్తిగా సిద్ధమైంది. ఈ సమయంలో దేశం మొత్తం శ్రీ రాముని భక్తిలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా రామభక్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. రామాలయంలో కొలువై ఉండే శ్రీ రాముని బాల రూపమైన రామ్ లల్లాను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
శ్రీ రాముడి జన్మ భూమి అయిన అయోధ్యలోని పురాతన సిద్ధ పీఠం హనుమాన్‌గర్హి అనే గొప్ప దేవాలయం ఉంది. అయితే అయోధ్య రామయ్య దర్శనం.. బజరంగ బలిని చూడకుండా పూర్తి కాదని.. అయోధ్య యాత్ర అసంపూర్తిగా మిగులుతుందని చెబుతున్నారు.
హనుమాన్‌గర్హి ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. శ్రీ రాముని భక్తుడైన ఆంజనేయస్వామి ఆలయం అయోధ్యలో హనుమాన్‌గర్హికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది అయోధ్యలోని పది ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం అయోధ్య నగరం నడి బొడ్డులో నిర్మించారు. హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్ లల్లా దర్శనం అసంపూర్తి అని విశ్వాసం.
రాముడు రావణుడిని సంహరించి లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన అనంతరం తన భక్తుడైన హనుమంతునికి బస చేయడానికి నగరంలో స్థలం ఇచ్చాడని ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు.. అతను మొదట హనుమంతుడిని దర్శించుకుంటారని రామయ్య చెప్పాడని చెబుతారు.
శ్రీ రాముడు హనుమంతుడికి ఇచ్చిన ప్రదేశం పురాతన సిద్ధపీఠం హనుమాన్‌గర్హి ఆలయం అని నమ్మకం. ఇప్పటికీ రామ భక్త హనుమాన్ ఇక్కడ నివసిస్తున్నారని విశ్వాసం.
ఇక్కడ ఆలయంలోని హనుమంతుడు అన్ని రకాల కష్టాలు, బాధలను తొలగించే దేవుడిగా భావిస్తారు. హనుమాన్‌గర్హి ఆలయంలోని హనుమంతుడికి ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రటి పువ్వులను సమర్పించిన ఆ భక్తుడి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని మత విశ్వాసం. హనుమంతుడి బాల రూపాన్ని హనుమాన్‌గర్హి ఆలయంలో చూడవచ్చు. ఆలయంలో హనుమంతుని తల్లి అంజనీ దేవి విగ్రహం కూడా ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు