Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈవేడుకలను కన్నుల పండుగగా జరిపేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టిటిడి అధికారులు అనేక సార్లు సమావేశమై వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తీసుకోవల్సిన చర్యలపై అన్ని విభాగాలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 27వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 5వ తేదీన చక్రస్నానంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడసేవ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సెప్టెంబరు 26వ తేదీ రాత్రి 7 నుండి 9 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 27వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజరోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ముఖ్యంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న రథోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగుతాయి. తొమ్మిదో రోజు అక్టోబర్ 5వ తేదీ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని అమరావతిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి కలిసి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు. దీంతో సెప్టెంబర్ 27వ తేదీన ధ్వజారోహనం సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రానుండటంతో పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం ప్రయాణించే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ముందుగా తాతయ్యగుంటలో గంగమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, ఆ తర్వాత అలిపిరి చేరుకుని అక్కడ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారని తెలిపారు అధికారులు. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారి తిరుమల మాడవీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..