
Adi Shankaracharya: భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ముఖ్యులు. కేవలం 32 సంవత్సరాల చిన్న జీవితం గడిపినప్పటికీ.. ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి దివ్యదీపంలా వెలుగొందుతోంది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, ప్రపంచానికి దాని గొప్పతనాన్ని చాటి చెప్పిన మహాగురువుగా ఆయనకు అపారమైన గౌరవం లభించింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి ఆధ్యాత్మిక సంపదల సారాన్ని గ్రహించి, వాటి అంతరార్థాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించిన మహర్షి ఆదిశంకరులు. విభిన్న ఆరాధనా మార్గాలలో ఏకత్వాన్ని దర్శింపజేసి, మత భేదాలను తొలగించి సమన్వయాన్ని నెలకొల్పారు.
శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాంద అనే ఆరు ఉపాసన పద్ధతులను ఒకే సత్యానికి దారితీసే మార్గాలుగా చూపించి, “షణ్మత స్థాపనాచార్యులు”గా ఖ్యాతి పొందారు. జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలను సమన్వయపరిచి ఆధ్యాత్మిక సాధనకు సమగ్ర దిశను చూపారు.
కేరళలోని కాలడి గ్రామంలో క్రీ.శ. 788లో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆయన జన్మించారు. చిన్న వయసులోనే వేదాలు, శాస్త్రాలు ఆరితేరి, అసాధారణ ప్రతిభను కనబరిచారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి, గోవిందపాదాచార్యులు వద్ద విద్యాభ్యాసం చేశారు.
ఆదిశంకరులు ఆసేతు హిమాచలం వరకు విస్తృతంగా పాదయాత్ర చేసి, అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి, ధర్మబోధ చేశారు. ఆయన యాత్రలు కేవలం భౌతిక ప్రయాణాలు కాకుండా, జ్ఞానప్రచార యజ్ఞాలుగా నిలిచాయి.
భారతదేశ నాలుగు దిక్కుల్లో ఆధ్యాత్మిక కేంద్రాలను స్థాపించారు:
ఈ పీఠాలు ఈ రోజుకీ ధర్మప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఆదిశంకరులు అనేక అమూల్య గ్రంథాలను రచించారు. వాటిలో ముఖ్యంగా:
అలాగే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలపై భాష్యాలు రాసి, అద్వైత సిద్ధాంతాన్ని స్థిరపరిచారు.
ఒక పేద మహిళ ఇచ్చిన చిన్న దానాని(ఉసిరి)కి కృతజ్ఞతగా ఆయన రచించిన “కనకధారా స్తోత్రం” ద్వారా లక్ష్మీదేవి కృపను పొందే కథ ఆయన కరుణను ప్రతిబింబిస్తుంది. ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు.
ఆదిశంకరుల ప్రధాన బోధ “అద్వైతం” — జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కావు, ఒకటే అన్న సత్యం. ఈ సిద్ధాంతం ద్వారా ఆత్మజ్ఞానం పొందినవారికి మోక్షం సిద్ధమవుతుందని ఆయన బోధించారు.
శంకరులు తన తల్లి ఆర్యాంబకు ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు, ఆమె మరణ వార్త విన్న వెంటనే తిరిగి వస్తారు. అయితే సన్యాసి ధర్మం ప్రకారం తాను అంత్యక్రియలు నిర్వహించకూడదనే ఆచారాన్ని అతిక్రమించకుండా, తన నేత్రాగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజింపజేస్తారు. ఈ విధంగా, మాటపట్టుదలతో పాటు ఆచారాన్ని కాపాడుతూ తల్లి ఆర్యాంబకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు.
తన చివరి దశలో హిమాలయ ప్రాంతంలో ఆధ్యాత్మిక తపస్సులో లీనమై పరమాత్మలో ఐక్యమయ్యారు. చిన్న వయసులోనే మహత్తరమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని మానవాళికి అందించారు.
వైశాఖ శుద్ధ పంచమి రోజున జరుపుకునే శంకర జయంతి, ఆయన బోధనలను స్మరించుకునే పవిత్ర దినం. ఈ రోజున ఆయన స్తోత్రాలను పారాయణ చేయడం, ధ్యానం చేయడం, అద్వైత తత్వాన్ని ఆచరించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించవచ్చు.
చివరగా.. జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకు కేవలం ఒక తత్వవేత్త మాత్రమే కాదు.. జీవన మార్గదర్శి. ఆయన చూపిన జ్ఞానమార్గం మనలోని అజ్ఞానాన్ని తొలగించి, ఆత్మసాక్షాత్కారానికి నడిపిస్తుంది. ఆయన బోధనలు యుగయుగాలపాటు మనకు ప్రేరణగా నిలుస్తాయి.