భారతీయ సంప్రదాయంలో ఆలయాలకు కొదవ లేదు. హిందూ సమాజంలోని దేవతలకు మందిరాలు నిర్మించి పూజలు జరుపుతుంటారు. దేశంలో దైవాన్ని నమ్మి పూజలు చేసేవారు కోకొల్లలు. వారు తమ మొక్కు చెల్లించుకునేందుకు రకరకాల మార్గాలను వెతుక్కుంటారు. తలనీలాలు సమర్పించడం, కాలినడకన రావడం, నిలువుదోపిడీ ఇవ్వడం, ముడుపులు సమర్పించుకోవడం.. ఇలా తమకు తోచిన విధంగా ఇష్ట దైవానికి సమర్పించుకుంటారు. ఇలా చేయడం ద్వారా తమ సమస్యల నుంచి భగవంతుడు బయట పడేస్తాడని నమ్ముతుంటారు. అయితే..ఈ భక్తుడు మాత్రం అందరి కంటే వినూత్నంగా దైవాన్ని దర్శించుకునేందుకు బయటల్దేరాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
అశోక్ అనే ఓ 46 ఏళ్ల భక్తుడు.. తన ఇష్టదైవమైన వైద్యనాథ్ దర్శనం చేసుకోవాలనుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్‌గఢ్‌లో ఉన్న బాబా వైద్యనాథ్ దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటే పొరపాటే. అతను మామూలుగా నడిచి వెళ్లడం లేదు. కాళ్లు పైకెత్తి చేతులమీద నడుస్తూ వెళ్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బలియానుంచి జూలై 11వ తేదీన అశోక్ యాత్ర ప్రారంభమైంది. వైద్యనాథుని దర్శనంతోనే తన యాత్ర ముగిస్తానని చెబుతున్నాడు ఈ భక్తుడు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.