ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, మాన్సాస్ ఛైర్మన్, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకూ మధ్య సాగుతున్న మాటల యుద్ధంకు తోడు.. కాపు నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ముద్రగడ రాసిన లేఖపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో మెజారిటీ వర్గమైన తూర్పు కాపులకు ఒక్క మంత్రి పదవి దక్కనీలేదని గుర్తు చేశారు. తూర్పు కాపులను ఓటు బ్యాంక్స్ గా వాడుకుని విసిరిపారేశారని అన్నారు. తన కుమార్తె అతిధి కోసం మీసాల గీత లాంటి కాపు నేతల్ని అశోక్ ఎదగనీయలేదన్న వాస్తవాన్ని ముద్రగడ గుర్తించాలని అన్నారు.
పూసపాటి అశోక్ మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో మెజార్టీ వర్గమైన తూర్పు కాపులకు ఒక్క మంత్రి పదవి లేదు. వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని విసిరిపారేశాడు అశోక్. ఇప్పటికీ తన కుమార్తె అదితి కోసం కాపు మహిళా నాయకురాలైన మీసాల గీతను ఎదగనివ్వట్లేదు. ముద్రగడ లాంటి వారు దీన్ని గుర్తించాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 27, 2021
అంతే కాదు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఆయనపై విరుచుకుపడ్డారు. 2016లో టీడీపీ ప్రభుత్వం 10 వేలకోట్ల విలువ చేసే 748 ఎకరాల భూములను సింహాచల ఆలయ ఆస్తుల జాబితానుంచి తొలగించారని సాయిరెడ్డి తాజా ట్వీట్‌లో విమర్శించారు.
ఇదిలావుంటే.. మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు విషయంలో వైసీపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ కాపు నేత ముద్రగడ పద్మనాభం రెండు రోజు క్రితం సీఎం జగన్‌కు ఓ లేఖ రాసిన సంగతి తెలిసింది. లేఖలో ముద్రగడ అంతటితో ఆగకుండా ఆ లేఖలో గతంలో బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీ అశోక్ గజపతిరాజును అభినందిస్తున్న ఓ ఫొటోను కూడా జత చేశారు. దీంతో అశోక్‌ను గతంలో అద్వానీ వంటి దిగ్గజ నేతలే గౌరవించారని జగన్‌కు ఆయన గుర్తుచేశారు.
తన లేఖలో ముందుగా జగన్‌కు నమస్కారాలతో మొదలుపెట్టిన ముద్రగడ.. ఆ తర్వాత ఈ ఉత్తరంలో విజయనగరం మహారాజా వారి కుమారులు అశోక్ గజపతిరాజు గారిని బీజేపీ అగ్రనాయకులు గౌరవ అద్వానీ గారు నాడు ఎలా గౌరవించారో చూడటం కోసం ఈ ఫొటో పంపుతున్నానన్నారు. ఇక లేఖలు పంపను. నిర్ణయం తమరిదే నంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు.