Vote for note case : ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టడం వల్ల ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు పట్టిన పీడ చంద్రబాబు అని చెప్పిన జోగి.. ఈ రోజు ఓటుకు కోట్లు కేసులో ఈడీ ఛార్జ్‌షిట్ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్‌రెడ్డి అన్నారు. 2015 మే 31న స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారని తెలిపారు.
ఈ సమయంలో చంద్రబాబు ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ ఫోన్‌లో మాట్లాడారు. చంద్రబాబు పాత్రను ఛార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించిందన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అవి చంద్రబాబు మాటలేనని ఫోరెన్సిక్ రిపోర్టు ధ్రువీకరించిందన్నారు. ఈ కేసులో ఈడీకి జెరుసలేం మత్తయ్య పూర్తి వాంగ్మూలం కూడా ఇచ్చారన్నారు. చంద్రబాబు సూచనలతోనే తాను రాయభారం చేశానని ఈడీకి మత్తయ్య వాంగ్మూలం ఇచ్చినా కూడా చంద్రబాబును విచారణ చేయకపోవడం సరికాదని జోగి అభిప్రాయపడ్డారు.