AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pinarayi Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎదురొడ్డి నిలుస్తున్న వలయార్‌ సిస్టర్స్‌ తల్లి!

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అసెంబ్లీ రణక్షేత్రంలో ఊహించని ప్రత్యర్థి ఎదురయ్యారు. ఆయన పోటీ చేస్తున్న ధర్మదం నియోజకవర్గంపై ఇప్పుడందరి దృష్టి పడిందంటే అందుకు కారణం సీఎం పోటీ చేస్తున్నందుకు కాదు..

Pinarayi Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎదురొడ్డి నిలుస్తున్న వలయార్‌ సిస్టర్స్‌ తల్లి!
Walayar Girls Contesting Against Pinarayi
Balu
| Edited By: Phani CH|

Updated on: Mar 18, 2021 | 5:26 PM

Share

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అసెంబ్లీ రణక్షేత్రంలో ఊహించని ప్రత్యర్థి ఎదురయ్యారు. ఆయన పోటీ చేస్తున్న ధర్మదం నియోజకవర్గంపై ఇప్పుడందరి దృష్టి పడిందంటే అందుకు కారణం సీఎం పోటీ చేస్తున్నందుకు కాదు.. ఆయనపై పోటీకి దిగుతున్న ఓ బాధిత మహిళ! కన్నబిడ్డలను కోల్పోయిన ఓ తల్లి! న్యాయం కోసం పోరాటం చేసి చేసి ఆలసిపోయిన ఓ అభాగ్యురాలు! ఓ సామాన్య దళిత మహిళ! ఇప్పుడు ధర్మదంలో ధర్మపోరాటం జరుగుతోంది.. ఆ మహిళ విజయం కోసం కొన్ని గొంతులకు ప్రార్థిస్తున్నాయి.. కొన్ని చేతులు భగవంతుడిని వేడుకుంటున్నాయి. ఇప్పుడామెది ఒంటరిపోరాటం కాదు.. చాలా మంది ఆమె వెనుక ఉన్నారు. వలయార్‌ సిస్టర్స్‌ తల్లి ఆమె! పినయర్‌ విజయన్‌పై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె దీనగాధ తెలుసుకోవాలంటే నాలుగేళ్ల కిందటకు వెళ్లాలి. 2017 సంవత్సరం ఆమె జీవితంలో చీకటి నింపింది.. ఆ ఏడాది జనవరి 13న 13 ఏళ్ల ఆమె కూతురుపై అత్యాచారం జరిగింది. ఆ అవమానాన్ని భరించలేక ఆ చిన్నారి ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషాదాన్ని మర్చిపోకముందే మార్చి నాలుగున తొమ్మిదేళ్ల రెండో కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు మృగాళ్లు.. ఆ చిన్నారి కూడా తన అక్కలాగే ఉరి వేసుకుని చనిపోయింది. రెండు నెలల వ్యవధిలో కూతుర్లిద్దని కోల్పోయిన ఆ తల్లి గుండె బద్దలయ్యింది.. ఏడ్చి ఏడ్చి కళ్లు ఇంకిపోయాయి.. న్యాయం కోసం తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయి. పోలీసులు సహకరించలేదు. న్యాయవాదులూ న్యాయం చేయలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఆమె పోరాడింది.. పోరాడుతూనే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రితోనే పోరాటం చేస్తోంది.. కేసును సీబీఐకి అప్పగించామని ప్రభుత్వం చెబుతున్నది కానీ.. ఆ తల్లికి న్యాయం జరుగుతుందా? నిందితులను పట్టుకోవడానికి ఇంతకాలం పడుతుందా? కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. వారిద్దరూ భవన నిర్మాణ కార్మికులే! వారిద్దరు పనికి వెళ్లినప్పుడు పెద్ద కూతురు చనిపోయింది. వారు ఇంటికొచ్చేసరికి కూతరుకు పైకప్పు కొక్కేనికి వేలాడుతూ కనిపించింది.. ముసుగువేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఇంట్లోంచి పరుగుపెడుతూ వెళ్లడాన్ని చిన్న కూతురు చూసింది కూడా! రెండు నెలలకే ఆ చిన్న కూతురు కూడా అలాగే చనిపోయింది.. కేసు విచారణ జరుగుతున్నప్పుడే దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన పోలీసు అధికారి ప్రమోషన్‌పై ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోయారు. అయిదుగురు నిందితులలో ఒకరి తరపున వాదిస్తున్న లాయర్‌ జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అధ్యక్షుడయ్యాడు. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో 2019 అక్టోబర్‌లో పోక్సో కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.. న్యాయం కోసం తల్లిదండ్రులు హైకోర్టు గడప తొక్కారు. పోక్సో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి కేసు వినర్విచారణను సీబీఐ చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు. సీబీఐ కూడా కేసును నీరుగార్చేందుకే ప్రయత్నిస్తోందని తల్లిదండ్రుల అభియోగం! ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమె గత నెల 27న శిరోముండనం చేయించుకున్నారు. అయినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై పోటీకి దిగారు. పాలక్కాడ్‌ జిల్లా వాయలూర్‌లో నివాసం ఉంటున్న ఆ తల్లి ఎంతగా దుఃఖించిందో..! ఎంతగా తల్లడిల్లిందో..! ఎంతగా ఆవేదన చెందిందో..! కూతుళ్లది ఆత్మహత్య అంటున్నారు పోలీసులు. కాదు కచ్చితంగా ఇది హత్యేనంటున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదన్నది తల్లి గట్టి నమ్మకం. ఇప్పటికీ ఇంటి పై కప్పును చూస్తే తల్లికి పిల్లలే గుర్తుకొస్తారు.. వారిపై అత్యాచారం చేసి ఉరి వేసిన వెళ్లినవారికి కఠినమైన శిక్ష పడాలన్నది తల్లి కోరిక.. అప్పుడే తన కూతుళ్ల ఆత్మలు శాంతిస్తాయని అంటున్నారు. ఇందుకోసమే ఆమె నాలుగేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో ఆందోళనలు చేస్తున్నారు. అనేక రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిరోముండనం చేయించుకున్నారు. గుండెలో ఎంత ఆవేదన గూడుకట్టుకుని ఉన్నదో కదా! ముఖ్యమంత్రిపై పోటీ చేస్తున్నది గెలుపు కోసం! సీఎంకు తను ఎవరో తెలియచెప్పడానికి! అప్పుడైనా తనకు జరిగిన అన్యాయం విజయన్‌కు తెలుస్తుందన్న భావన! దోషుల పక్షాన నిలుస్తున్న పోలీసుల గురించి తెలుస్తుందన్న చిగురంత ఆశ! దోషులను కఠినాతికఠినంగా శిక్షిస్తామన్న ముఖ్యమంత్రి ఆ మాటే మర్చిపోయారని అంటున్నారు వలయార్‌ సిస్టర్స్‌ తల్లి .ఇప్పటి వరకు ఓ తల్లిగా న్యాయపోరాటం చేశానని, ఇప్పట్నుంచి తన రాజకీయ పోరాటం ప్రారంభమయ్యిందని చెప్పారు. పోస్ట్‌మార్టంలో ఇద్దరు పిల్లలూ చనిపోవడానికి ముందు వారిపై అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది.. అత్యాచారం చేసి చంపేసిన వారిని శిక్షించాలని, వలయార్‌ సిస్టర్స్‌కు న్యాయం జరగాలని కేరళ అంతటా ఉద్యమాలు జరిగాయి.. ప్రదర్శనలు జరిగాయి.. ప్రజల ఆగ్రహాన్ని చూసిన ప్రభుత్వం అయిదుగురిని అరెస్ట్‌ చేసింది. ఇందులో ఒకరు పోలీసు విచారణ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారపార్టీకి చెందిన వారితో నిందితులకు సంబంధాలున్నాయని, అందుకే కేసును పక్కదోవపట్టిస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆమె ప్రకటించగానే అధికార ఎల్‌డీఎఫ్‌ ఓ ప్రకటన చేసింది. ఆమెకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, సీబీఐ దర్యాప్తు చివరి దశలో ఉందని మంత్రి బాలన్‌ చెప్పుకొచ్చారు. అయినా అధికారపార్టీ నేతల మాటలను ఎవరూ నమ్మడం లేదు. మే 2న వెల్లడయ్యే ఫలితాలలో ఆమె విజయం సాధిస్తుందా లేదా అన్నది ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు . కానీ ఆమెకు న్యాయం జరగాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడామెకు కాంగ్రెస్‌ అండగా నిలిచింది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన విజయన్‌ ఇప్పటి వరకు ఆ ఊసే మర్చిపోయారు. వలయార్‌ నీతి యాత్రలో భాగంగా ఆ తల్లి ధర్మదం చేరుకున్నప్పుడు అక్కడున్న వేలాది మంది మాతృమూర్తులను కలిసింది.. అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారితో హామీ తీసుకోవాలని వేడుకుంది.. దానికి వారంతా ఇచ్చిన సందేశం ఒక్కటే! ‘ఎవరో ఎందుకు? నువ్వే పోటీ చెయ్యి.. ఆ విధంగానైనా ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్నించే అవకాశం వస్తుంది’ అని సూచించారు. అందుకే పోటీకి దిగానంటోంది వలయార్‌ సిస్టర్స్‌ తల్లి. తనకు సంఘ్‌ పరివార్‌ మద్దతు ఇస్తే తీసుకోనని, యూడీఎఫ్‌తో పాటు ఎవరు సపోర్ట్‌ చేసినా స్వీకరిస్తానని అంటోంది. మే 2న ఏం జరుగుతుందో చూద్దాం!

Walayar Girls Contesting Against Pinarayi

Walayar Girls Contesting Against Pinarayi

మరిన్ని ఇక్కడ చదవండి: MS Dhoni Clean Bowled: తెలుగోడి బౌలింగ్‌లో ధోని క్లీన్ బౌల్డ్… వైరల్ అవుతున్న వీడియో..

David Warner: ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. రెండు మ్యాచుల్లో 24 బౌండరీలు.. దూకుడుమీదున్న డేవిడ్ భాయ్..