బీఎస్పీ, సీపీఐ, సీపీఎమ్‌లతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీట్ల కేటాయింపులలో భాగంగా మంగళగిరి స్థానాన్ని సీపీఐ అభ్యర్థికి ఇచ్చారు. అయితే టీడీపీ తరపున ఆ స్థానం నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తుండగా.. జనసేన తరపున అభ్యర్థిని ప్రకటించకపోవడంపై వైసీపీకి చెందిన పలువురు విమర్శలు చేశారు. నారా లోకేశ్‌ను గెలిపించడానికే పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించకుండా సీపీఐకి ఇచ్చారని.. దీంతో టీడీపీ- జనసేన లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది అంటూ కామెంట్లు చేశారు. అయితే ఓ స్ట్రాటెజీతో పవన్ కల్యాణ్ ఈ స్థానాన్ని సీపీఐకి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సీపీఐ, సీపీఎమ్‌లు పోటీ చేశాయి. అయితే అప్పట్లో కాంగ్రెస్ 32.5% శాతంతో ఆ స్థానాన్ని కైవసం చేసుకోగా.. కమ్యూనిస్టులు ఇద్దరికీ 31.3%, ప్రజారాజ్యంకు 24.6% ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు మంచి పట్టు ఉందని భావించిన పవన్ ఈ సారి అదే స్ట్రాటెజీతో ముందుకెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే తన పార్టీ తరఫున కాకుండా సీపీఐ అభ్యర్థిని పవన్ ప్రకటించినట్లు సమాచారం. మరి పవన్ స్ట్రాటెజీ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.